కాంగ్రెస్ ఏకపక్ష విధానాలకు, వంశపారంపర్య రాజకీయాలకు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ఎదుట బానిసలుగా బతకడం, దళారులే నాయకులుగా చెలామణి కావడం వంటి పలు విధానాలకు వ్యతిరేకంగా స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. కానీ పార్టీ పుట్టిన 1983 నుంచి పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఎన్నో అవమానాలు, కక్ష్యసాధింపులు ఎదుర్కొంటూ, జైళ్లకు కూడా వెళ్లిన నిజాయితీపరులైన సీనియర్లు టిడిపిలో ఏ ప్రాధాన్యం లేకుండా ఉంటూ ఉంటే సుజనాచౌదరి, సీఎం రమేష్ వంటి దళారులు మాత్రం టిడిపి ఫలాలను అనుభవిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరకముందు సుజనాచౌదరి, సీఎం రమేష్, మంత్రి నారాయణ వంటి వారి బతుకులు ఏమిటో రాజకీయ పరిజ్ఞానం ఉన్న అందరికీ తెలుసు. వారు ఏం చేసి పార్టీలో ప్రాధాన్యం సంపాదించారో కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన బహిరంగ రహస్యం. అలాంటి సీఎం రమేష్ ఇప్పుడు కడపకు ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తున్నాడు. ఈయనతో పాటు బిటెక్ రవి కూడా తోడయ్యాడు.
దీనిపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఉక్కు కోసం టిడిపి చేస్తున్నవన్నీ కొంగ జపాలని, నిజానికి కడపకు ఉక్కు పరిశ్రమ రావడం టిడిపికే ఇష్టం లేదని, గతంలో దానిని అడ్డుకున్న ఘనత టిడిపిదేనని పవన్ విమర్శించాడు. ఈ విషయంలో పవనే కాదు.. టిడిపిలోనే ఉన్న సీనియర్ నాయకుడు జె.సి.దివాకర్‌రెడ్డి అయితే సీఎం రమేష్‌ని, ఈ దీక్షను తీవ్రంగా విమర్శించాడు. దీనిపై సీఎం రమేష్ మాట్లాడుతూ, తాము చిత్తశుద్దితో బావి తరాల కోసం దీక్షను చేస్తుంటే వాటిని కించపరిస్తే ఊరుకోమని అంటూనే కడప పౌరుషాన్ని చూపిస్తామని పవన్‌ని హెచ్చరించాడు. సీఎం రమేష్‌కి ఇంత కాలానికి కడప పౌరుషం గుర్తుకు రావడం విశేషం.
పవన్ గురించి మాట్లాడాలంటే ఎన్నో ఉన్నాయని సీఎం రమేష్ వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే ఆయన మాటలు బ్లాక్‌మెయిలింగ్ కిందకే వస్తున్నాయని చెప్పాలి. పవన్ విషయంలో మహా తప్పు పడితే ఆయన మూడు పెళ్లిళ్లను తప్ప విమర్శించేందుకు మరో విషయం లేదు. మరి సీఎం రమేష్ చేస్తున్నది కొంగజపమే అనేది జగమెరిగిన సత్యం. దీనినే పవన్ చెప్పాడు. ఇంకా సీఎం రమేష్ మాట్లాడుతూ, దమ్ముంటే తమ సభాస్థలికి వచ్చి మాట్లాడాలని చాలెంజ్ విసిరాడు. మరోవైపు శివాజీ కూడా ఈ దీక్షకు మద్దతు తెలిపి టిడిపి కోసం రావడం లేదంటూ సూక్తులు చెబుతున్నాడు. పవన్ విమర్శల సంగతి సరే.. సీఎం రమేష్ జె.సి.దివాకర్‌రెడ్డి విమర్శలకు ముందుగా సమాధానం చెప్పాల్సి ఉంది. లేదా ఆయన ఎలా రాజకీయంగా ఎదిగాడో చర్చకు సిద్దం అయితే బాగుంటుంది.