అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం యావత్ సినీ ప్రేక్షకులనే కాకుండా.. ఆయన కుటుంబ సభ్యులను కూడా తీవ్ర దు:ఖసాగరంలో ముంచెత్తింది. ఆమె మరణం తర్వాత ఆమెకు 'మామ్' చిత్రానికి గాను జాతీయ ఉత్తమనటి అవార్డు వస్తే శ్రీదేవి తరపున బోనీకపూర్ ఆ అవార్డును అందుకుని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. దాంతో బోనీ-శ్రీదేవి కూతుర్లు, బోనీ మొదటి భార్యపిల్లలు ఆయనను ఓదార్చారు.
తాజాగా బ్యాంకాక్‌లో ఐఫా సినిమా వేడుకల సంబంరం జరిగింది. ఇందులో కూడా 'మామ్' చిత్రానికి గాను శ్రీదేవికి ఉత్తమనటి అవార్డు లభించింది. దీంతో ఈ అవార్డును బోనీకపూర్ స్వీకరిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న ఆయన కుమారుడు అర్జున్‌కపూర్, అనిల్ కపూర్‌లు ఆయనను ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నా జీవితంలో ప్రతి క్షణం శ్రీదేవిని మిస్ అవుతున్నాను. ఆమె ఇప్పటికీ ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తోంది.
శ్రీదేవిలాగానే జాన్వికపూర్‌ని కూడా ప్రేక్షకులు ఆదరించాలి. ఈ అవార్డును 'మామ్' యూనిట్‌కి అంకితం చేస్తున్నానని ఆ చిత్రానికి నిర్మాత కూడా అయిన బోనీ ప్రకటించాడు. ఇదే చిత్రానికి గాను ఉత్తమ సహాయనటునిగా అవార్డును అందుకున్న నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా తన అవార్డును శ్రీదేవికి అంకితం చేశాడు.