మనం ఎవరమో...మన సిద్దాంతాలు ఏమిటో పక్కనపెట్టి మన వెనుక మదర్‌థెరిస్సా, గాంధీ, అంబేడ్కర్, చెగువేరా వంటి వారి ఫొటోలు పెట్టుకున్నంత మాత్రాన మనం కూడా గొప్పవారిమైపోం. వారి బాటలో ఎంత వరకు నడిచామనే దాని మీద మన సిద్దాంతాలు, ఆశయాలు, మన వ్యక్తిత్తం ఆధారపడి ఉంటాయి. ఇక చిరంజీవి తన ఐ అండ్ బ్లడ్‌బ్యాంకు విషయాలలో మదర్‌ధెరిస్సా, గాంధీ, అంబేడ్కర్, జ్యోతిరావు పూలే వంటి వారి ఫొటోలు ముద్రించి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ప్రెస్‌మీట్లలో కనిపించేవాడు. ఇక పవన్ తనకి చెగువేరా ఆదర్శమని చెబుతాడు. ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే చిరంజీవి, పవన్‌కళ్యాణ్ వంటి వారు విపరీతమైన ఫాలోయింగ్, క్రేజ్ ఉన్నవారు. ఇతరులు చెప్పే సందేశాల కన్నా వీరు చెబితే అవి సామాన్యులకు కూడా చేరుతాయి. అంతటి ప్రభావశీలురై ఉండి సినిమా అనే అత్యంత శక్తివంతమైన సాధనం చేతిలో ఉన్నా కూడా చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌తో పాటు ఇతర హీరోలు తమ సిద్దాంతాలు ఏమిటి? అనేవి చెప్పరు. పవన్ చెగువీరా ఆదర్శంగా చేసిన చిత్రాలేవీ లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
ఇక తాజాగా చెగువేరాని కోలీవుడ్ స్టార్ సూర్య తన చిత్రం కోసం బాగా వాడుకుంటున్నాడు. పవన్ చేయలేని పనిని తాను చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం విలక్షణ చిత్రాల దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్జీకే' అనే చిత్రంలో నటిస్తున్నాడు. సందేశాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సూర్య రాజకీయ నాయకునిగా కనిపించనున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ తాజాగా విడుదలైంది. ఇందులో సూర్య క్యూబా పోరాటయోధుడు చెగువేరా గెటప్‌లో కనిపిస్తున్న లుక్ అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఇందులో సూర్య సరసన రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'సర్కార్' చిత్రంతో పాటే దీపావళకి విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తెలుగులోకి కూడా అనువాదం కానుంది. మరి సూర్య అయినా పవన్ చేయలేని పనిని చేసి చెగువేరా ఆశయాలకు ప్రాచుర్యం కల్పించేలా చేస్తాడని ఆశిద్దాం...!