ఈమధ్యకాలంలో అచ్చమైన తెలుగమ్మాయిగా ఇండస్ట్రీకి పరిచయమై, పలు చిత్రాలతో బిజీగా ఉన్న హీరోయిన్ ఈషారెబ్బా. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'అరవింద సమేత వీరరాఘవ'లో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీనితో పాటు పలు చిత్రాలలో ఆమెకి అవకాశాలు వస్తున్నాయి. ఇక విషయానికి వస్తే ఎంత సినీ సెలబ్రిటీలైన రాజకీయ నాయకులతో చనువుగా, సన్నిహితంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం, వారి కళ్లలో పడేందుకు నానా తిప్పలు పడుతుంటారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విషయానికి వస్తే ఆయన సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. సాయం అడిగిన వారికి స్పందిస్తూ, పలు కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ, ఏవైనా ఫిర్యాదులు అందితే న్యాయం చేయడం, ఫన్నీ ట్వీట్స్ చేయడం, ఇతరులు చేసిన ట్వీట్స్‌కి వెంటనే స్పందించడం చేస్తుంటాడు.
తాజాగా ఈషారెబ్బా కేటీఆర్‌ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేయగా ఆయన వెంటనే ఆమెకి బదులిచ్చాడు. ఈషారెబ్బా ట్వీట్ చేస్తూ, మన దేశంలో ప్లాస్టిక్‌ని నిషేదించిన రాష్ట్రాలు ఎన్ని? మన రాష్ట్రం చాలా విషయాలలో నెంబర్‌వన్‌గా ఉంది. కానీ మన రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఎందుకు మార్చడం లేదు? మీరు దీని గురించి సీరియస్‌గా ఆలోచించమని కేటీఆర్‌ని కోరింది. దానికి వెంటనే సమాధానం ఇచ్చిన కేటీఆర్.. కేవలం చట్టాలు చేయడం ద్వారా ప్లాస్టిక్‌ని నిషేధించలేం. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలు అధికారులు, తయారీ దారులు, వినియోగ దారులకు అర్ధమయినప్పుడే దానిని అంతమొందించ వచ్చు, దీనిపై ప్రస్తుతం అవగాహన కల్పిస్తున్నామని తెలిపాడు.
దానికి ఈషారెబ్బా వెంటనే స్పందించినందుకు కృతజ్ఞతలు సార్.. కానీ మీ వాదనతో నేను ఏకీభవించడం లేదు. మీలాంటి సమర్ధవంతమైన నాయకులు ఉంటే దేన్నయినా సాధించగలం. మీరు తలుచుకుంటే రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టగలరు అని వ్యాఖ్యానించింది.