కొందరు ఏదైనా విషయం మాట్లాడితే అందులో ఎక్కువగా డొంకతిరుగుడు వ్యవహారం ఉంటుంది. ఇది అని ఖచ్చితంగా చెప్పకుండా పలు విధాలుగా మాట్లాడి వినేవారిని కన్‌ఫ్యూజన్‌కి గురి చేస్తారు. అది వారు తమ తెలివితేటలని అనుకుంటూ తాము ఎంతో తెలివిగా మాట్లాడుతున్నామని, అర్ధం చేసుకోగలిగిన వారు చేసుకుంటారని అంటారు. ఇక విషయానికి వస్తే కేరళకుట్టి లక్ష్మీమీనన్ దక్షిణాది ప్రేక్షకులకు హీరోయిన్‌గా సుపరిచితమే. 'కుంకీ' చిత్రంతో ఈమె కోలీవుడ్‌ని ఆకట్టుకుంది. హీరోయిన్‌గా మంచి బిజీగా ఉన్న సమయంలో చదువు కోసమని చెప్పి కెరీర్‌కి బ్రేక్‌నిచ్చింది. అదే ఆమెకు శాపంగా మారింది. విశాల్, విజయ్‌సేతుపతి, జయం రవి వంటి స్టార్స్‌తో నటించిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం అనుకున్న స్థాయిలో అవకాశాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క చిత్రం ఉంది. ప్రభుదేవా నటిస్తోన్న యంగ్ మంగ్‌చంగ్ చిత్రంలో ఆమె యాక్ట్ చేస్తోంది.
తాజాగా ఆమె పెళ్లిగురించి మాట్లాడుతూ, వివాహబంధం మీద నాకు నమ్మకం లేదు. ప్రేమ, అభిమానాలు ఉండాలంటే పెళ్లే చేసుకోవాలని లేదు. అలాగని నాకు తోడు అవసరం లేదని నేను చెప్పడం లేదు. తోడు అంటే బలమైన నమ్మకం, ప్రేమ, విశ్వాసం వంటివి ఉండాలి. అలాగని అది సహజీవనం కూడా కాదు. అందుకే నేను పెళ్లి చేసుకోను. కానీ నాకు అండను మాత్రం ఖచ్చితంగా చూసుకుంటాను. నేను మాట్లాడేది ఇతరులకు అర్ధం అవుతుందో లేదో తెలియదు గానీ నేను ఎంతో తెలివిగా మాట్లాడుతున్నాను. దానికి పెళ్లి అనే పేరు పెట్టడం నాకిష్టం లేదు.
మరో విషయం ఏమిటంటే జీవితంలో అనుభవమే ఉత్తమ ఉపాధ్యాయుడు. అలాగని నేను ఇప్పటివరకు పెళ్లి, ఇతర విషయాలపై చెప్పిన విషయాలు అనుభవం ద్వారా తెలుసుకున్నవి కావంటూ గందరగోళంగా మాట్లాడింది. మరి ఈ మాటలు జనాలకు అర్ధం కాకపోయినా ఆమెకైనా అర్ధం అయ్యాయా? లేదా? అనేది అనుమానమే.