నిజానికి మన దేశంలో కేవలం సిద్దాంతాలపై ఆధారపడి నడిచే జాతీయ పార్టీలు రెండు మాత్రమే. అవి బిజెపి, వామపక్షాలు. ఈ పార్టీల్లో ఎంతటి గొప్ప వ్యక్తి అయినా పార్టీ నిర్ణయాలను శిరసావహించాల్సిందే. కాదని ఆయా పార్టీల నుంచి బయటకు వస్తే వారికి ఎలాంటి గౌరవం ఉండదు. ఇక బిజెపి, వామపక్షాలు రెండు భిన్నదృవాల వంటివి. అలాంటి బిజెపితో 2014లో జతకట్టిన పవన్ ఇప్పుడు దానికి పూర్తి భిన్నమైన వామపక్షాల వైపు మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఆయన వామపక్షాలది తనది ఒకే భావజాలమని పేర్కొన్నాడు.
ఇక ఈయన తాజాగా మాట్లాడుతూ, గతంలో కడప స్టీల్ ప్లాంట్‌ని వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాని కోసం నానా రచ్చ చేస్తోందని, గత ఎన్నికల్లో విడిపోయిన ఏపీలో రాజకీయ సుస్థిరత కోసం టిడిపి, బిజెపిలకు మద్దతు ఇచ్చానని, 2019లో ఏపీలో సమతుల్యం ఏర్పడేందుకు పోటీ చేస్తున్నానని తెలిపాడు. టిడిపి అధికారంలోకి వస్తే పరిశ్రమలు వస్తాయని, తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని భావించానని, కానీ టిడిపి పాలనతో అసలు పరిశ్రమలే రావడం లేదని దుయ్యబట్టారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే యువతలో నిరాశ, నిస్పృహలు పెరిగి అశాంతి నెలకొంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఎవరైనా కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే వారిని లంచాలు అడుగుతున్నారని తనతో కొందరు విదేశాలలో అన్నారని వ్యాఖ్యానించాడు.
లోకేష్ అవినీతి పరుడు, శ్రీవారి ఆభరణాలు విదేశాలకు తరలి వెళ్లిపోయాయి. తాజాగా పరిశ్రమలు స్థాపించేందుకు లంచాలు అడుగుతున్నారు... వంటి ఆరోపణలన్నింటిలో ఆయన ఆధారాలు లేకుండా ఎవరో వింటే తెలుసుకున్నానని చెప్పి తన ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం ఆయన అనుభవ రాహిత్యానికి నిదర్శనంగా చెప్పాలి. విమర్శలు చేయమంటే గ్రామాలలో మూరు మూల పల్లెలలో రచ్చబండ వద్ద ఉండే వారు కూడా చేస్తారు. కానీ ఆధారాలు చూపి విమర్శలు చేస్తేనే పవన్ వంటి నాయకులకు గుడ్ విల్ ఏర్పడుతుందనే విషయం ఆయన గమనించకపోవడం దురదృష్టకరం.