డబ్బు అందరు సంపాదిస్తారు. కానీ దయాగుణం కలిగిన కొందరే సమాజానికి తాము కూడా చేతనైంత సాయం చేయాలని భావిస్తారు. ఈ దానగుణం ఈ మద్య కాలంలో బాగా తగ్గిపోతోంది. కానీ ఈమద్య మరలా మన స్టార్ హీరోలు, వారి భార్యలు, హీరోయిన్లు కూడా అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం, వారికి గుండె ఆపరేషన్లు చేయించడం, ఊర్లని దత్తత తీసుకోవడం, ప్రకృతివైపరీత్యాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించడం వంటివి చేస్తున్నారు. ఈ విషయంలో అక్కినేని కొత్త కోడలు సమంత మరింతగా తన సేవలను విస్తరిస్తోంది.
ఇప్పటికే ఈమె పలువురు బాలబాలికలకు ఆపరేషన్లు చేయించడంతో పాటు తన ఆర్గనైజేష్ ద్వారా పలు సేవాకార్యక్రమాలను చేపడుతోంది. మరోవైపు చేనేత కార్మికుల కోసం తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా సేవలు అందిస్తోంది. ఇక విషయానికి వస్తే తెలుగులో 'అక్షయపాత్ర'కి అర్ధం అందరికీ తెలుసు. ఎందరు ఎంత తిన్నా కూడా ఖాళీ అవ్వని పాత్రను అక్షయపాత్ర అని పిలుస్తారు. ఆ మధ్య ఓ సారి రాజమౌళి కూడా అక్షయపాత్ర ఫౌండేషన్ గురించి స్పందించి ఉన్నాడు.
తాజాగా సమంత ఈ కార్యక్రమం ద్వారా 100మంది పాఠశాల విద్యార్ధులను ఎంచుకుని వారికి రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఏడాదికి కేవలం 950 రూపాయలు ఇస్తే ఏడాది మొత్తం ఓ విద్యార్థికి రుచికరమైన పౌష్టికాహారం ఇవ్వవచ్చని. మన పనులతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనాలని తెలిపిన ఆమె అక్షయపాత్ర వెబ్‌సైట్‌కి చెందిన లింక్‌ని పోస్ట్ చేస్తూ అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరింది. అక్కినేని కొత్తకోడలు చేస్తున్న ఈ మంచి పని పట్ల అన్ని చోట్లా మంచి ప్రశంసలు లభిస్తూ ఉండటం విశేషం.