నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించిన సావిత్రి బయోపిక్ మహానటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్స్ కి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఈ మహానటి సినిమాలో గెస్ట్ లుగా అనేకమంది దర్శకులు తో పాటుగా సినిమాల్లో పేరున్న హీరో, హీరోయిన్స్ కూడా నటించారు. షాలిని పాండే, నాగ చైతన్య, మాళవిక నాయర్ వంటి నటీనటులు ఈ సినిమాలో అతిధి పాత్రలు చేశారు. ఏఎన్నార్ పాత్రలో నాగ చైతన్య నటించాడు. అలాగే ఎన్టీఆర్ పాత్రకి జూనియర్ ఎన్టీఆర్ చేయలేనని చెప్పడంతో.. చేసేది లేక గ్రాఫిక్స్ తో చూపించేసారు. ఇక ఏఎన్నార్ సీన్స్ లో నాగ చైతన్య కనిపించాడు. అయితే సినిమాలోని అన్ని పాత్రలకు మంచి పేరొచ్చినా ఏఎన్నార్ పాత్రలో చేసిన నాగ చైతన్య అంతగా మెప్పించలేకపోయాడనే టాక్ వుంది.
ఇప్పుడు తాజాగా నాగ చైతన్య మరో బయోపిక్ లో ఏఎన్నార్ పాత్ర చేస్తున్నాడనే ప్రచారం మీడియాలో జరుగుతుంది. అదికూడా బాలకృష్ణ నేతృత్వంలో క్రిష్ డైరెక్ట్ చెయ్యబోయే ఎన్టీఆర్ బయోపిక్ లో నాగ చైతన్య మరోసారి ఏఎన్నార్ గెటప్ వెయ్యబోతున్నాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినబడుతున్నాయి. మహానటిలో ఏఎన్నార్ గా నటించిన నాగ చైతన్య ఎన్టీఆర్ బయోపిక్ లోను ఏఎన్నార్ గా నటిస్తాడా అనే విషయం తెలియదు గాని.. ఎన్టీఆర్ నట జీవితంలో ఏఎన్నార్ పాత్ర ఎటువంటితో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కలిసి అనేక సినిమాల్లో నటించారు. మల్టీస్టారర్ లు చేశారు. పోటీగా అనేక సినిమాలు చేశారు కూడా.
ఎన్టీఆర్ పాత్రకి బాలకృష్ణ చేస్తుంటే.. ఏఎన్నార్ పాత్రలో నాగ చైతన్య చేస్తాడనే అనే టాక్ వినబడుతుంది. అయితే బాలకృష్ణ ఆహార్యం ముందు నాగ చైతన్య ఏఎన్నార్ గెటప్ లో అసలు ఆనడనేది మాత్రం ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇప్పటికే మహానటిలో ఏఎన్నార్ గెటప్ లో వీక్ గా ఉన్న నాగ చైతన్య మళ్లీ కావాలని ఎన్టీఆర్ బయోపిక్ లో నటించి.. అందరితో నెగిటివ్ కామెంట్స్ వేయించుకోవడం అనేది తన కెరీర్ కి మాత్రం అస్సలు మంచిది కాదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఎలాగూ ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ కున్న ప్రాధాన్యత ఏఎన్నార్ కు ఉండదు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్.. నాగ చైతన్యని కలిసి ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ పాత్రను పోషించమని కోరాడట. ఏఎన్నార్ పాత్ర నిడివి ఎక్కువగానే వుంటుందనీ .. సన్నివేశాలకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్టుగా సమాచారం. మరి ఈ పాత్ర చెయ్యడానికి చైతు అంగీకరిస్తాడో.. లేదో అనేది మాత్రం ఫుల్ సస్పెన్స్.