తెలుగులో హాస్యనటునిగా ఈమద్య బాగానే రాణిస్తున్న కమెడియన్లలో షకలకశంకర్‌ని ప్రధానంగా చెప్పుకోవాలి. ఆయన తన సినిమాలలో, స్కిట్స్‌లో చిరంజీవి ప్రస్తావన తేకుండా, పవన్‌కళ్యాణ్‌ని అనుకరించకుండా ఉండడు. ఇక ఈయన తాజాగా మాట్లాడుతూ, నాకు ఊహ తెలిసినప్పుడు మొదటగా విన్న హీరో పేరు చిరంజీవి. నేను స్కూల్‌కి వెళ్లి చదివేవాడిని కాదు. టీచర్ పాఠాలు చెబుతూ ఉంటే నేను మాత్రం చిరంజీవి గారి ఫొటోలను గీసేవాడిని. నన్ను కొట్టి కొట్టి టీచర్‌కే విసుగువచ్చింది. దాంతో ఆయన నేను గీసిన చిరంజీవి చిత్రాలకే కరెక్ట్ కొట్టి మార్కులు వేసేవారు. నాకు చిరంజీవి గారంటే ఎంతో అభిమానం. పవన్‌కళ్యాణ్ గారంటే ప్రాణం.
ఇక నేను 'జబర్ధస్త్' నుంచి బయటకు రావడానికి కారణం ఉంది. నేను మొదటి నుంచి సినిమాలతో పాటే బుల్లితెరపై కనిపిస్తున్నాను. కొంతకాలం జబర్దస్త్ చేసిన తర్వాత నాకు కాన్సెప్ట్స్ దొరకలేదు. అలాగని ఏది పడితే అది చేసే రకం కాదు నేను. డబ్బులు పోతున్నాయి కదా...జబర్ధస్త్‌లో ఎలాగోలా కొనసాగాలని ఎప్పుడు ఆలోచించలేదు. కాన్సెప్ట్ లేకపోతే అనవసర విషయాల గురించి మాట్లాడుకోవాల్సివస్తుంది. తిట్లు, బూతులు చోటు చేసుకోవడం జరుగుతుంది. అలాంటివి చేయడం నాకు ఇష్టం లేదు. దాంతో నేను నాగబాబు, రోజా గార్లకి, దర్శకనిర్మాతలకు కూడా విషయం చెప్పి ఆ షో నుంచి బయటకి వచ్చేశానని చెప్పుకొచ్చాడు.
ఇక ఈయన ప్రస్తుతం కమెడియన్ వేషాలు వదిలేసి హీరోగా చేయాలని భావిస్తున్న తపన చూస్తుంటే ఈయన గతంలో కమెడియన్లుగా బిజీగా ఉండి హీరోలుగా మారి కమెడియన్లుగా, హీరోలుగా రెంటికి చెడ్డ వారి గుణపాఠాలు ఈయన ఇంకా నేర్చుకోలేదా? అనిపిస్తోంది.