పాడిందే పాడరా పాచిపళ్ల దాసుడా.. అన్నట్లుగా తయారవుతోంది జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ తీరు చూస్తుంటే. చేయడానికి పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తాడు. కానీ వాటిల్లో విశ్వసనీయత ఉంటుందా? అంటే అది ఆయనకే తెలియదు. ఎవరో చెప్పారు...నేను విన్నాను.. అంటూ సినిమా డైలాగ్స్, కట్టుకథలుగా చెబుతాడే గానీ ఒక్క ఆరోపణ మీద కూడా నా వద్ద ఆధారాలు ఉన్నాయి అని గట్టిగా చెప్పలేడు. వారెవరో మాట్లాడుకుంటూ ఉంటే విన్నానని లోకేష్ మీద ఆరోపణలు చేశాడు. ఇప్పుడేమో విమానాశ్రయంలో ఓ ఐపీఎస్ అధికారి చెప్పాడు. శ్రీవేంకటేశ్వరస్వామి విలువైన వస్తువులను ప్రత్యేక విమానంలో దేశాల సరిహద్దులను దాటించారని ఆరోపించాడు. మిడిల్ ఈస్ట్ దేశాలకు ఓ ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో విలువైన వస్తువులు తరలి వెళ్లాయని, కాబట్టే రమణదీక్షితులు చేసిన ఆరోపణలు తనకేమీ ఆశ్యర్యం కలిగించలేదన్నాడు.
ఇక మరోవైపు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, టిడిపి ప్రతిపక్ష పార్టీలో ఉందని, ఈ విషయం వారందరికీ తెలుసని పేర్కొన్నాడు. పవన్ భావిస్తున్నట్లు ఇవేమీ చిన్న ఆరోపణలు కాదు. నాడు రాష్ట్రంలో ఆయన అన్నయ్య చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఇక ఇంత పెద్ద మిస్సింగ్ వ్యవహరాలు తెలిసిన పవన్ ఆ సంఘటనను చూసి వదిలేసిన తెలుగుదేశం పార్టీకి ఆ తర్వాత మద్దతు ఎలా ఇచ్చాడు? శ్రీవారి సొమ్ములను కాజేసిన వారి గురించి ఇంత కాలం మౌనంగా ఎందుకు ఉన్నాడు అనేది అర్ధం కాని విషయం. ఇక పగిలిపోయింది పింక్ డైమండ్ కాదని, పింక్ రూబీ అనే నివేదికపై నాడు పవన్‌కి ఆప్తుడైన టీటీడీ ఈఓ ఐవైఆర్ కృష్ణారావు, ఇప్పుడు ఆరోపణలు చేస్తోన్న రమణదీక్షితులు నాడు సంతకాలు చేసిన విషయం పవన్‌కి తెలియదా? ఇంతకాలం స్వామివారి సేవలో ఉండి ఇప్పుడు ఆరోపణలు చేస్తోన్న రమణదీక్షితులని ఇంతకాలం మౌనంగా ఎందుకు ఉన్నాడో పవన్ నిలదీయకుండా ఉండటం సరికాదు.
అసలు రమణదీక్షితులు మంచి స్థానంలో ఉండగానే తిరమలలో అన్యమత ప్రచారాలు కరపత్రాల వంటివి వెలుగు చూశాయి. నాడు క్రిస్టియన్ అయిన వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రమణదీక్షితులు తిరుమలలో యాగం చేయించాడు. నాడు భూమన కరుణాకర్‌రెడ్డి వంటి నాస్తికుడికి వైఎస్ టిటిడి బోర్డ్ పగ్గాలు అప్పగించాడు. తాజాగా రమణదీక్షితులు ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో ఆయనకు మద్దతుగా క్రిస్టియన్ మతానికి చెందిన ప్రచారకుడు కూర్చుని ఆయనకు సాయం చేస్తూ కనిపించాడు. ఇదంతా చూస్తుంటే రమణదీక్షితులు వాటికన్ దళారీనా అనే అనుమానం కలుగుతోంది. కానీ పవన్‌కి మాత్రం ఇవేమీ పట్టవు. ఎవరో తనతో ఎయిర్‌పోర్ట్‌లో ఏదో అన్నారని మాత్రమే ఆయన దానినే నిజమని చెబుతూ ఉండటం ఆయన విషయలేమికి ఉదాహరణగా చెప్పాలి.