పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఏదైనా విషయంపై మాట్లాడాలంటే ఆచితూచి స్పందించాల్సి వుంటుంది. లేకపోతే అది వారికి పెద్ద తలనొప్పిగా మారుతుంది. అందునా రజనీకాంత్ వంటి తమిళనాడును శాసించే స్టార్ ఈ విషయంలో మరింత జాగరూకతతో ఉండాల్సిందే. మౌనంగా ఉన్నా ఫర్వాలేదు గానీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే వారికి ఉన్న పేరుతో పాటు భవిష్యత్తులో రాజకీయాలలో వెలుగొందాలని తపన పడే వారికి పెద్ద సమస్యలే ఎదురవుతాయి. చాలా విషయాలలో మౌనంగా ఉంటూ, దేవుడు శాసిస్తాడు.. నేను పాటిస్తాను అంటూ డొంకతిరుగుడుగా సమాధానం చెప్పే వ్యక్తి సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్. ఈయన భాష ఎప్పుడు చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది అనే ధోరణిలోనే ఉంటుంది.
అలాంటిది తాజాగా ఆయన తమిళనాడులోని తూత్తుకుడిలో ఆందోళన కారులు పోలీసుల కాల్పులలో మరణించిన తర్వాత వారిని పరామర్శించడానికి వెళ్లి ప్రతి విషయానికి ప్రజలు ఉద్యమాలంటూ మొదలు పెడితే చెడే జరుగుతుందంటూ ఉద్యమకారులను కించపరిచే తరహాలో వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల పట్ల తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కొంత కాలానికే ఆయన నటించిన 'కాలా' చిత్రం విడుదలైంది. ఈ చిత్రం హిట్టయిందని రజనీ అంటున్నాడు. కానీ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. దీనిపై తమిళ సీనియర్ దర్శకుడు, స్టార్ విజయ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తూత్తుకుడి ఘటనపై రజనీ చేసిన వ్యాఖ్యలే 'కాలా' చిత్రం పరాజయానికి కారణమయ్యాయని ఆయన ఓపెన్‌గా చెప్పేశాడు.
సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లే ప్రజలు ఆందోళనల బాట పడుతున్నారని రజనీ గ్రహించాలి. కొత్తగా రాజకీయాలలోకి వచ్చేవారు సినిమాలు వేరు, రాజకీయాలు వేరని గుర్తించే లోపలే వారి మనుగడ ప్రశ్నార్దకం అవుతోందని తెలిపాడు. సమాజంలో జరుగుతున్న అక్రమాల నేపధ్యంలో సినిమాలు తీయడం నటుల బాధ్యత. ప్రజాసమస్యల ఆధారంగానే రజనీ 'కాలా' చిత్రం తీశాడు. అయితే తూత్తుకుడి విషయంలో రజనీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఆయన 'కాలా' చిత్రాన్ని ఫ్లాప్ చేశాయి. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలలో తీవ్ర సంక్షోభం నెలకొని ఉంది. అందుకే నేను నా కుమారుడు విజయ్‌ని రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నానని చెప్పుకొచ్చాడు.