హీరో నితిన్ 'ఇష్క్' చిత్రంతో దాదాపు వరసగా డజనుకు పైగా ఇచ్చిన ఫ్లాప్‌లకు ఫుల్‌స్టాప్ పెట్టి మరలా రేసులోకి వచ్చాడు. ఆ తర్వాత ఈయన 'చిన్నదాన నీకోసం, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్‌ఎటాక్'తో పాటు పలు చిత్రాల ద్వారా ఫర్వాలేదనిపించాడు. 'అ...ఆ'తో తన కెరీర్‌లోనే బెస్ట్ హిట్‌ని సాధించాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన ఎన్నో ఆశలతో నటించిన 'లై, చల్‌మోహన్ రంగ' చిత్రాలు బాగా నిరాశపరిచాయి. ఇదే సమయంలో ఆయన 'దిల్' చిత్రం తర్వాత ఎంతో గ్యాప్ ఇచ్చి మరలా దిల్‌రాజు బేనర్‌లో సతీష్‌వేగ్నేష్ దర్శకునిగా రాశిఖన్నా హీరోయిన్‌గా 'శ్రీనివాసకళ్యాణం' చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఆగష్టులో విడుదల చేయాలనుకుంటున్నారు.
తాజాగా నితిన్ మరో చిత్రానికి కూడా పచ్చజెండా ఊపాడు. నాగశౌర్య, రష్మికమండన్న నటించిన 'ఛలో'వంటి డిఫరెంట్ లవ్‌స్టోరీతో హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని 'అ...ఆ' చిత్రాన్ని నిర్మించిన హారిక అండ్ హాసిని బేనర్ సహ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. టైటిల్‌గా 'భీష్మ'ను ఫిక్స్ చేశారు. దీనికి ట్యాగ్‌లైన్‌గా 'సింగిల్ ఫరెవర్' అని పెట్టారు.
ఓ ప్రేమకథను 'భీష్మ' టైటిల్‌తో తెరకెక్కించనుండటం అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రం ద్వారా తాను మరలా పెద్ద హిట్ కొట్టాలనే పట్టుదలతో నితిన్ ఉన్నాడు. మరి ఆయన కోరిక నెరవేరుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...!