ప్రస్తుతం ఉన్న కమెడియన్లలో శ్రీనివాసరెడ్డిది సపరేట్ స్టైల్. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీలాంగ్వేజ్‌లు ఎంతో గమ్మత్తుగా ఉంటాయి. ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలలో వారి ఫ్రెండ్స్‌గా కామెడీ పాత్రలను పోషిస్తూనే 'జయంబు నిశ్చయంబురా, గీతాంజలి, ఆనందోబ్రహ్మ' వంటి చిత్రాలలో తనకి నప్పే విధంగా ఉన్న ప్రాముఖ్యం ఉన్న పాత్రలను చేస్తున్నాడు. మొదటి నుంచి ఈయనకు సినిమా ఫీల్డ్‌లోకి రావాలని ఉండేది కాదట. కానీ స్నేహితులంతా నువ్వు సినిమాలకి కరెక్ట్‌గా సరిపోతావని ప్రోత్సహించి ఆయన్ను హైదరాబాద్ పంపారు. అలా హైదరాబాద్ వచ్చిన శ్రీనివాసరెడ్డి తన స్నేహితుని రూంలో ఉంటూ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
మొదటగా దూరదర్శన్‌లో ఓ అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెంటనే అవకాశాలు వస్తాయని భావించాడు. కానీ రాలేదు. చివరకు 'ఇష్టం' చిత్రంలో చిన్న పాత్ర వచ్చింది. ఆ తర్వాత రఘుకుంచె, జూనియర్ రేలంగిలు కలిసి ఈయనను పూరీజగన్నాథ్‌కి పరిచయం చేశారు. ఎట్టకేలకు ఆ చిత్రంలో అవకాశం రావడమే కాదు.. ఆ చిత్రమే అయనకు బ్రేక్‌నిచ్చింది. ఇక శ్రీనివాసరెడ్డి 15ఏళ్ల కిందట ఓ స్నేహితుని పెళ్లికి వెళ్లాడు. స్నేహితులందరూ ఎంతో కాలం తర్వాత కలవడంతో కలిసి బీరులు తాగారు. తర్వాత ఈయన ఇంటికి వచ్చాడు. ఆయన తల్లి ఎదురుగా కూర్చుని, వీధిలోని వారందరూ ఆ అబ్బాయిని చూడండి.. ఎలా చెడిపోతున్నాడో అంటున్నారు. ఇలా వదిలేశారే? ఏమవుతాడో అంటుంటే భయంగా ఉందిరా. అయినా నువ్వు ఏమి చేసినా నాకు తెలిసిపోతూనే ఉంటుందనే విషయం మర్చిపోకు అన్నది.
నిజంగానే మా అమ్మ నేను బీర్లు తాగిన విషయం గుర్తుపట్టేసింది. వెంటనే గట్టిగా నన్ను పట్టుకుని ఇక తాగను అని ప్రామిస్ చేయించుకుంది. ఆరోజు నుంచి నేటి వరకు అంటే దాదాపుగా 15ఏళ్ల నుంచి నేను మద్యం ముట్టుకోలేదు అని శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు.