తెలుగులో మాస్, క్లాస్ అనే తేడా లేకుండా తన సంగీతంతో ఎంతో కాలం తెలుగు సినీ పరిశ్రమను ఓలలాడించిన సంగీత దర్శకుడు మణిశర్మ. ఆయన తాజాగా మాట్లాడుతూ, నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో పనిచేశాను. కానీ సంగీత దర్శకునిగా నన్ను ఫిక్స్ చేసిన తర్వాత నా పనిలో నేను పడిపోయేవాడిని, వారి పనులు వారు చూసుకునేవారు. వారిని హండ్రెడ్‌డేస్ ఫంక్షన్లలో గానీ బర్త్‌డే ఫంక్షన్లలో మాత్రమే కలిసేవాళ్లం. కానీ నేటి స్టార్స్ ఆ విధంగా లేరు. ఈయన చెబితే మనం వినేదేంటి అనుకుంటున్నారు. వారు చెప్పేది 50, 60శాతం తప్పయినా వారు చెప్పినట్లే చేయాల్సివస్తోంది. ఏం చేద్దాం.. ఇది హీరో ఓరియంటెడ్ ఇండస్ట్రీ.
ఇక నేను చిరంజీవిగారి 'చూడాలని ఉంది' చిత్రం చేశాను. అందులో ఉదిత్ నారాయణ్ చేత 'రామ్మా..చిలకమ్మా' పాటను పాడించాను. కానీ చిరంజీవి ఒప్పుకోలేదు. రొంప పట్టిన గొంతులా ఉంది వద్దు అన్నారు. కానీ యూనిట్‌లోని అందరు ఆ పాట ఎంతో బాగుందని అన్నారు. సినిమా విడుదలయ్యాక ఆ పాటే పెద్ద హిట్ అయింది. అప్పుడు చిరంజీవి ఓ సారి మాట్లాడుతూ, కొన్నిసార్లు జడ్జిమెంట్‌లు తప్పవుతుంటాయి అని చెప్పారు.
ఇక 'చిరుత' చిత్రం విషయంలో కూడా అలాగే జరిగింది. అందులోని 'ఓసోసి రాకాసి' పాట యూనిట్‌లోని ఎవ్వరికీ నచ్చలేదు. దర్శకుడు కూడా తీసేద్దామన్నారు. చిరంజీవి కూడా అదే భావించారు. కానీ ఆ పాట బాణీలో కొత్తదనం ఉందని ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంతో చెప్పాను. చివరకు ఆ చిత్రంలోని పాటలన్నింటిలో ఆ పాటే పెద్ద హిట్ అయిందని చెప్పుకొచ్చాడు.