అనుకోకుండా మంచి ఊపులోకి వచ్చిన దేవిశ్రీప్రసాద్, తమన్ వంటి వారి హవా దెబ్బకి మెలోడీబ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ అర్ధాంతరంగా పెద్ద స్టార్స్ చిత్రాల నుంచి బయటకు పంపబడ్డాడా? లేక ఆయన నొచ్చుకునే విధంగా ప్రవర్తించడం వల్ల స్టార్స్ ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారా? అనేది ఎవ్వరికీ అంతుచిక్కని విషయం. అయినా ఎంత పెద్ద, గొప్ప సంగీత దర్శకుడైనా కొత్త నీరు వచ్చే కొద్ది అవకాశాలు తగ్గిపోవడం ఎవరికైనా సహజమే. సినిమా సంగీతాన్ని ఒంటిచెత్తో ఏకచ్చత్రాధిపత్యంగా ఏలిన ఇళయరాజా, సింగర్ ఎస్పీబాలు వంటి వారు కూడా క్రమంగా తెరమరుగయ్యారు.
ఒకనాడు ఇళయరాజా హవా ఎలా ఉండేదంటే ఆయన సంగీతం అందించినందుకు పారితోషికం ఇస్తూనే ఆయన సంగీతం అందించిన చిత్రాల ఆడియో సేల్స్‌లో కూడా ఆయన పట్టుబట్టి రాయల్టీ తీసుకునేవాడు. కానీ మణిరత్నం ఒక్కసారిగా రెహ్మాన్‌ని పరిచయం చేయడం, రెహ్మాన్ కూడా బాలుని కాదని, కొత్త సింగర్స్‌కి పెద్ద పీట వేయడం జరిగింది. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ విషయానికి వస్తే అటు ట్యూన్స్‌ని, ఇటు బీజీఎంని కూడా సమపాళ్లలో మరీ ముఖ్యంగా బీజీఎం అందించడంలో ఆయనే సిద్దహస్తుడు. ఈయన ప్రతి స్టార్‌కి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్‌ని అందించారు.
ఇటీవల ఆయన మాట్లాడుతూ.. ఇక చిన్న చిత్రాల ద్వారా తాను ఎంతో స్వేచ్చగా సంగీతం అందిస్తానని, ఛాన్స్‌ల కోసం ఎవ్వరినీ బతిమాలాల్సిన పనిలేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక మణిశర్మ అందరికంటే ఎక్కువగా మహేష్‌బాబుతో మొదటి నుంచి కలిసి జర్నీ చేస్తూ వచ్చాడు. ఆయనకు 'పోకిరి, అతడు, అర్జున్, ఒక్కడు, ఖలేజా, మురారి' వంటి సూపర్‌హిట్స్ ఆల్బమ్స్ ని అందించాడు.
మహేష్‌బాబు కెరీర్ ప్రారంభమైన దగ్గరి నుంచి ఆయన చిత్రాలకు నేను పనిచేస్తూ వచ్చాను. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అనుకోకుండా ఎక్కడో చిన్న తెలియని డిస్టర్బెన్స్ వచ్చింది. బహుశా ఆయన మనసు నొచ్చుకునేలా నేను మాట్లాడి ఉంటా. విషయమేమిటో తెలుసుకుందామంటే వీలుకాలేదు. ఆ తర్వాత మేమెక్కడా కలుసుకోలేదు. పెద్ద హీరోలకు నేను చివరగా పనిచేసిన చిత్రాలలో 'ఖలేజా, శక్తి, తీన్‌మార్' ఉన్నాయి. నేను బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన చిత్రాలలో ఇవి కూడా ఉన్నాయి. కానీ ఆ తర్వాత వారెవ్వరూ నా వంక చూడలేదు. నా తప్పేమిటి నాకు అర్దం కావడం లేదని చెప్పుకొచ్చాడు.