నిజానిజాలను పక్కనపెడితే ఇంతకాలం రాని ఆరోపణలన్ని ఇప్పుడు టాలీవుడ్ మెడకి చుట్టుకుంటున్నాయి. కానీ వీటిపై తమదైన వాయిస్ వినిపించే సినీ పెద్దలే కరువయ్యారు. దాసరి తర్వాత ఎవరికి వారు ఆ విషయంలో మనకెందుకులే అనుకుంటున్నారు. ఒకవైపు సినీ పెద్దలుగా వ్యవహరించాలనే కోరిక లోపల బలంగా ఉన్నా కూడా ఇలాంటి విషయాలలో మాత్రం మౌనంగా ఉంటున్నారు. దాంతో సినీ రంగం తరపున గట్టిగా తమ వాదన వినిపించేవారు కరువవుతున్నారు. అసలు తమలో ఏమీ తప్పులు లేకుండానే ఇన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయా? అని ఆలోచించేవారులేకుండా పోతున్నారు. ముందు తమ ఇంటిని తాము సరిదిద్దుకోవాలనే కనీస స్పృహ లేకుండా పోతోంది. మా అసోసియేషన్‌వారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే తరహాలో నాన్చుడు ధోరణి అవలంభించడం కూడా దురదృష్టకరం. ఒకటి వెంట ఒకటి వచ్చిపడుతున్నాయి.
వీటిని ఎవరో బయటి వారు సృష్టించినవి కావు. ఇండస్ట్రీ వాళ్లమని చెప్పుకునే వారే దీనికి మూల కేంద్రాలుగా మారుతున్నారు. ఇంతకాలం అయినా శ్రీరెడ్డి వంటి వారు ఇంకా మితిమీరుతూనే ఉన్నారు. కానీ మన సినీ పెద్దలు మాత్రం దొంగలను వదిలేసి మీడియాను దొంగా దొంగా అనడంతోనే సరిపెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ విషయంపై సినీ పెద్ద అయిన తమ్మారెడ్డి భరద్వాజ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, ఈమద్య అమెరికాలో వ్యభిచారం చేస్తున్నారని ఓ జంటను అరెస్ట్ చేశారు. చార్జిషీట్‌లో కూడా 'పింప్' (తార్చేవాడు) అని రాశారు. సినిమా వారిమని ఆ జంట అయిన కిషన్ మోదుగమూడి అలియాస్ శ్రీరాజ్, ఆయన భార్య చంద్రలు చెప్పారట. ఇంతకాలం భారతదేశంలోనే అనుకున్నా. ఇప్పుడు ప్రపంచంలో ఏమి జరిగినా తెలుగు సినిమా వాళ్లేకారణం అయిపోతున్నారు. వాళ్లెవరో తెలియదు. ఎప్పుడో సినిమా రంగంలో ఉన్నామంటారు. ఇక్కడి నుంచి ప్రోగ్రామ్స్ కోసం అమెరికా వెళ్లిన వారు సినిమా వారా? కాదా? అనేది తెలియదు. ఏం జరిగినా సినిమా వారే అంటున్నారు.
అతన్ని పింప్ అనకుండా నిర్మాత, సినిమా వాడు అని ఎందుకు అంటున్నారు. తప్పు చేసిన వాడిని తప్పుడోడు అనకుండా సినిమా వాళ్లని మీడియా ఎందుకంటోంది? సినిమావాళ్లే సాఫ్ట్‌కార్న్ ఎందుకు అవుతున్నారు? మీడియా వారు కూడా మారాలి. సహకరించాలి. తప్పుని తప్పు అని, మంచిని మంచి అని రాయండి. కానీ లేనివి ఉన్నట్లుగా, ఎవరో చెప్పిన వాటిని ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేయవద్దు అని చెప్పుకొచ్చాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తెలుగు పరిశ్రమలో తెలుగమ్మాయిలు అనేవారే లేకుండా పోతారు అని ఆవేదన వెలిబుచ్చారు. అయినా ఇప్పుడు మాత్రం తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో ఎక్కడ ఉన్నారు కనుక..?