ప్రముఖ జర్నలిస్ట్ గౌరీలంకేష్ హత్య నుంచి విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ మోదీపైనా, కేంద్రంలోని బిజెపి పైనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆయన కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి సపోర్ట్ చేయనప్పటికీ మోదీని, బిజెపి ఓడించాలని సోషల్‌మీడియా ద్వారా తీవ్ర ప్రచారం చేశారు. మోదీ పతనం కర్ణాటక నుంచే మొదలవుతుందని తెలిపాడు. ఆయన చెప్పినట్లే జరిగింది. ఇక మోదీ అసలు విషయాలను, తన పరిపాలనను మరిచి సెలబ్రిటీలతో మంతనాలు, తన ఖరీదైన కోటుతో టూర్లు చేస్తూ పైసా ఖర్చులేని స్వచ్చభారత్, ఫిట్‌నెస్ చాలెంజ్‌లతో కాలం గడిపేస్తున్నాడు.
ఇక దీనిపై ప్రకాష్‌రాజ్ తాజాగా వ్యంగ్యంగా చేసిన ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. ఇటీవలే మిగిలిన విషయాలను పక్కన పెట్టి కుమారస్వామిని పరిపాలనపై దృష్టి పెట్టాలని చెప్పాడు ప్రకాష్‌రాజ్. తాజాగా మోదీ కుమారస్వామికి ఫిట్‌నెస్ చాలెంజ్ విసిరిన నేపధ్యంలో డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ దీక్షకు మమతాబెనర్జీ, విజయన్, కుమారస్వామి, చంద్రబాబులతో పాటు పలువురు సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ సెటైరికల్‌గా మోదీని ఉద్దేశించి ట్వీట్ చేస్తూ 'డియర్ సుప్రీం లీడర్... ఫిట్‌నెస్ చాలెంజ్‌లు, యోగాలు, ఎక్సర్‌సైజ్‌లతో మీరు చాలా బిజీగా ఉన్నారని మాకు తెలుసు. ఒక్క క్షణం గుండెల నిండా ఊపిరిని పీల్చుకుని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. ఢిల్లీ ముఖ్యమంత్రితో కలిసి అధికారులు పనిచేయాలని ఆదేశించండి. కేజ్రీవాల్ చేస్తున్నవి మంచి పనులే. ఆ తర్వాత ఎక్సర్‌సైజ్‌లతో పాటు మీ డ్యూటీలను కూడా చేయండి' అంటూ సుతిమెత్తగా ఆయన మోదీని ఉద్దేశించి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.