స్వర్గీయ నటసార్వభౌమ, సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు బయోపిక్‌ని ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ చేయనున్నాడని తెలిసిన రోజు నుంచి నందమూరి అభిమానుల ఆనందానికి అవధులే లేవు. కానీ దర్శకునిగా అర్ధాంతరంగా తేజ తప్పుకోవడంతో ఈ చిత్రంపై పలు నీలి నీడలు కమ్ముకున్నాయి. కానీ బాలయ్య మాత్రం ఎంతో ముందు చూపుతో ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ చేతిల్లో పెట్టాడు. నిజానికి ఈ చిత్రానికి తేజ కంటే క్రిష్ వల్లనే పరిపూర్ణత లభిస్తుందని నమ్మేవారి సంఖ్యే అధికం. బాలయ్య వందో చిత్రంగా 'గౌతమీ పుత్ర శాతకర్ణి'ని రికార్డు పుటల్లోకి ఎక్కిస్తూ అలాంటి చారిత్రక చిత్రాన్ని కేవలం 80రోజుల లోపలే అత్యంత క్వాలిటీతో తీయడం బహుశా క్రిష్ తప్ప మరెవ్వరూ చేయలేరేమో.
ఇక ఎన్‌బికే బేనర్‌పై బాలకృష్ణ, సాయికొర్రపాటిలు స్వయంగా ఎన్టీఆర్ బయోపిక్‌ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభం గ్రాండ్‌గా జరిగింది. ఇప్పుడు ఈ చిత్రం విడుదల తేదీని కూడా ఖరారు చేశారు. ఈ తేదీకి కూడా ఎంతో విశిష్టత ఉండటం విశేషం. తెలుగుదేశం పార్టీని స్థాపించి, రికార్డు స్థాయిలో కేవలం 9 నెలలలో పార్టీని విజయపథంలో నడిపి ముఖ్యమంత్రి అయి రికార్డులను తిరగరాసిన ఘనత ఎన్టీఆర్‌ది.
ఆయన మొదటి సారిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు జవనరి 9వ తేదీ. ఇది బాలయ్యకి ఎంతో అచ్చివచ్చిన సంక్రాంతి సెంటిమెంట్ కావడంతో ఎన్టీఆర్ బయోపిక్‌ని కూడా జనవరి 9న విడుదల చేయనున్నామని యూనిట్ అనౌన్స్ చేసింది. ఇక ఇదే సంక్రాంతికి రామ్‌చరణ్-బోయపాటి శ్రీనుల చిత్రం కూడా షెడ్యూల్ ఖరారు చేసుకుంది. మరి బాలయ్య తనకి అచ్చి వచ్చిన సీజనులో తన తండ్రి పాత్రలో ఎలా కదం తొక్కుతాడో వేచిచూడాల్సివుంది...!