రాజకీయాలంటే సినిమా కాదు. సినిమా అంటే ఎలా తీసినా, దాని ఫలితం ముందుగానే తెలిసినా సక్సెస్‌మీట్స్, ఇతర ప్రీరిలీజ్ ఈవెంట్స్ వంటి వాటిల్లో ఒకరిపై ఒకరు పొగడ్తలు గుప్పించుకుంటారు. లేని కలెక్షన్లు వేసుకుంటూ సంబరపడుతూ ఉంటారు. అది వారి ప్రైవేట్ డబ్బు కాబట్టి దానిపై ఎవ్వరూ ప్రశ్నించడానికి వీలులేదు. కానీ రాజకీయాలు అలా కాదు. మొదట్లో పవన్‌కళ్యాణ్ ప్రజాసేవ, ప్రజల సమస్యలను పరిష్కరించడానికే రాజకీయలలోకి వస్తున్నానని, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సీఎం కానవసరం లేదని చెప్పాడు. ఇది అక్షరసత్యం. అంటే నాడు 2017లో ఆయన వాస్తవంలోనే ఉన్నాడు. కానీ ఒక్క ఏడాది కూడా తిరగకుండానే ఆయన మాటల్లో అతిశయోక్తులు జోడయ్యాయి. వీటన్నింటికి కారణం పవన్ కూడా తన చుట్టూ భజన పరులను చేర్చుకోవడమే. ఈ మధ్య పవన్ కాబోయే సీఎం తానేనని, అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తానని చెబుతున్నాడు.
ఇక జన సైనికులు కూడా ఆయన ఎక్కడ కనిపించినా కాబోయే సీఎంగా భావిస్తూ సీఎం సీఎం అని నినాదాలు చేస్తున్నారు. అలా అరుస్తున్నప్పుడు కూడా పవన్ కాస్త జాగరూకతలోనే ఉన్నాడు. మీరు సీఎం సీఎం అని అరిచినంత మాత్రాన సీఎంని కానని, మీరందరు వెళ్లి ఓట్లేస్తేనే సీఎంని అవుతానని చెబుతున్నాడు. ఇక తాజాగా రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా లగడపాటి రాజగోపాల్ సర్వేలకు ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. తాజాగా ఆయన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అధికార తెలుగుదేశంకి 110 సీట్లు వస్తాయని, జగన్ ఇప్పుడున్న ప్రతిపక్షనేతగానే 60 సీట్లు మాత్రమ సాధిస్తాడని ఆ సర్వే తేల్చిచెబుతోంది. మిగిలిన వారికి ఐదారు స్థానాలు వస్తాయని చెప్పడంతో అది కూడా ఉభయగోదావరి జిల్లాల్లో పవన్‌కి వచ్చేవి ఐదారు సీట్లు అని స్పష్టమవుతోంది. ఈ లెక్కన పవన్‌కంటే ఆయన అన్నయ్య చిరునే బెటర్ అని చెప్పాలి. మరోవైపు పవన్‌తో పాటు జనసైనికులు కూడా గత ఎన్నికల్లో కేవలం తమ పుణ్యానే తెలుగుదేశం గెలిచిందని వాదిస్తున్నారు.
ఈ సర్వేని బట్టి అది కూడా నిజం కాదని తేలుతోంది. రాష్ట్రంలో పవన్‌కి ఉన్న ఓట్ల శాతం 6 కంటే ఎక్కువలేవని ఈ సర్వే తేల్చిచెబుతోంది. అయినా ఈ లెక్కలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రమే. కానీ ఎన్నికలు నవంబర్‌లో జరుగుతాయని అంటున్నారు. బహుశా ఆ సమయనికి కూడా ఇదే లెక్కలు ఉంటాయనే పలువురు భావిస్తున్నారు. ఈ సర్వే ఫలితాలు చంద్రబాబు అండ్ టీంకి ఊరట అని చెప్పవచ్చు.