రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన 'ఆఫీసర్' చిత్రం కొన్నిరోజుల కిందట విడుదలైంది. మొదటి రోజున ఈ చిత్రం కేవలం 55లక్షల షేర్‌ని మాత్రమే తెచ్చింది. ఈ విషయంలో నాగార్జున తప్పు లేకపోయినా వర్మ ట్రాక్ రికార్డు దీనిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ చిత్రం మొదటి రోజునే చతికిల పడింది. మొదటి వీక్‌లోనే తిరుగుటపా కట్టిన ఈ చిత్రం కోటి రూపాయల షేర్‌ని కూడా సాధించలేకపోయింది. ఇక ఈ చిత్రం విడుదలైన కొన్నిరోజులకే మంచి టాలంట్ ఉన్న దర్శకునిగా పేరు తెచ్చుకున్న జయేంద్ర దర్శకత్వంలో అందునా పిసిశ్రీరామ్ వంటి సినిమాటోగ్రాఫర్ పనిచేసిన నా నువ్వే చిత్రం విడుదలైంది. కళ్యాణ్‌రామ్ ఇప్పటి వరకు కనిపించిన ఫ్రెష్‌లుక్‌లో కనిపిస్తూ ఉండటం, తమన్నా అందాలు కూడా బాగానే అలరిస్తున్నా కూడా ఈ చిత్రం కూడా మొదటి రోజు కేవలం 60లక్షలు మాత్రమే తేగలిగింది.
మరోవైపు దీనితో పాటు విడుదలైన 'సమ్మోహనం' చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం, 'అభిమన్యుడు' చిత్రం కూడా ఇంకా కలెక్షన్లు రాబడుతూ ఉండటంతో ఈ చిత్రం పుంజుకునే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఎన్టీఆర్ ప్రమోట్ చేయక పోయినా 'ఎమ్మెల్యే' చిత్రమే దీనికంటే బెటర్ అనిపించింది. ఎన్టీఆర్ ప్రమోట్ చేసినా 'నానువ్వే' పరిస్థితి దారుణంగా ఉంది. ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ 7కోట్లు జరిగిందని అంటున్నారు. అంటే అందులో ఏడో శాతం కూడా వచ్చే సూచనలు లేవు. ఈ చిత్రాన్ని మొదట దర్శకుడు జయేంద్ర శర్వానంద్, నిఖిల్‌లకి వినిపించాడట. ఓ అమ్మాయి, అబ్బాయిని విధి ఎలా కలిపింది? అనే పాయింట్ నేటి జనరేషన్‌ని ఆకట్టుకోలేదని, లవ్‌స్టోరీలో ఇంటెన్సిటీ కూడా లేకపోవడంతో వారిద్దరు ఈ చిత్రానికి నో చెప్పి మంచి పనే చేశారు.
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఉంది. 'నానువ్వే' చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన మొదటి రోజునే ఏకంగా 7మిలియన్ వ్యూస్‌ని సాధించి రికార్డు క్రియేట్ చేసింది. 'అజ్ఞాతవాసి, రంగస్థలం, భరత్ అనే నేను'తో పోలిస్తే ఇది రికార్డు. మరి దీనిని బట్టి ఈ వ్యూస్ నిజమైనవేనా? ఫేకా? అనే దానిపై ఫిల్మ్‌నగర్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది.