ప్రస్తుతం తెలుగులో బుల్లితెర మీద ట్రెండింగ్‌లో ఉన్నది ఏమిటంటే ఎవరైనా ఠక్కున బిగ్‌బాస్ పేరే చెబుతారు. ఈ కార్యక్రమం మొదటి సీజన్‌ని ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు. ఇక హోస్ట్ ఎన్టీఆర్, పార్టిసిపెంట్స్‌తో సహా రెండో సీజన్‌కి అందరు మారిపోయారు. కొత్త పార్టిసిపెంట్స్‌తో పాటు కొత్త హోస్ట్‌గా నేచురల్ స్టార్ నాని వచ్చాడు. ఇక ఇందులో బిగ్‌బాస్ చేసేది ఏమిటంటే.. పార్టిసిపెంట్స్‌కి టాస్క్‌లు ఇవ్వడం, నియమ నిబంధనలను తెలియజేయడం, ఆదేశాలను జారీ చేయడం వంటివి చేస్తూ ఉంటాడు. మిగిలినవన్నీ తెర వెనుక నుంచి ఓ గంభీరమైన వాయిస్ ఈ కార్యక్రమాన్ని కొనసాగేలా చేస్తుంది.
నిజానికి హోస్ట్ కనిపించేది వారానికి రెండు రోజులే. దాంతో ఈ తెర వెనుక నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చే గొంతే ఈ కార్యక్రమాన్ని మరింతగా రక్తి కట్టించడానికి మూల కారణం అవుతుంది. ఇప్పటికే ఎంతో గంభీరంగా ఉన్న ఈ కంఠం అందరినీ కట్టిపడేస్తోంది. మరి ఇంతకీ ఆ గంభీరమైన గొంతు ఎవరిది? అనేది ఇప్పుడు వీక్షకుల్లో ఎంతో ఉత్సుకతను రేపుతోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బిగ్‌బాస్ నిర్వాహకులు ఈ గొంతు కోసం ఏకంగా 100మందిని టెస్ట్ చేశారట. చివరకు ఈ గంభీరమైన గొంతు కలిగిన వ్యక్తికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్టు, పలు సినిమాలు, సీరియల్స్, ప్రకటనలకు గతంలో తన గొంతుని అరువిచ్చిన రాధాకృష్ణ అనే డబ్బింగ్ ఆర్టిస్టే బిగ్‌బాస్‌కి వాయిస్ ఇస్తున్నాడని తెలుస్తోంది. ఈ విషయంలో రాధాకృష్ణ స్పందిస్తే గానీ ఇది నిజమా? కాదా? అనేది తేలదు.