తమిళ వెర్షన్ మినహా 'కాలా' పరిస్థితి మరో 'కబాలి'లానే ఉందని స్పష్టమవుతోంది. తమిళ వెర్షన్ విడుదలైన తమిళనాడు, కర్ణాటక, మలేషియా, అమెరికాలలో మాత్రం రజనీ మ్యాజిక్ పనిచేస్తోంది. కానీ మిగిలిన అన్నిచోట్లా ఈ చిత్రం తిరుగుటపా కట్టేసింది. ముఖ్యంగా తెలుగులో 'కబాలి'కి పోటీగా అన్నట్లుగా ఈ చిత్రం విశాల్ 'అభిమన్యుడు' వంటి చిత్రం సాధించిన వసూళ్లను కూడా రాబట్టలేకపోతోంది. మరోవైపు రాజకీయాలలోకి వస్తానని చెప్పిన తర్వాత రజనీ పరిస్థితి ఇలా తయారవ్వడం మాత్రం ఆందోళన కలిగించే విషయం.
రజనీ బొమ్మ కనిపిస్తే చాలు.. సినిమా ఎలా ఉన్నా పట్టించుకోకుండా ఆదరిస్తారనే ప్రచారాన్ని 'కాలా' చిత్రం తప్పని నిరూపిస్తోంది. దీంతో రంజిత్ పా మీద రజనీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక 'కబాలి' విషయానికి వస్తే అది బయటి నిర్మాత తీసిన చిత్రం. కానీ 'కాలా' పరిస్థితి అది కాదు. దీనిని స్వయంగా రజనీ అల్లుడు, స్టార్ ధనుష్ వండర్‌బార్ పతాకంపై అతి తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేసి భారీ రేట్లకు అమ్ముకున్నాడు. ఇక తెలుగులో ఈ చిత్రానికి బిజినెస్ కాకపోవడంతో లైకా సహకారంతో ధనుషే విడుదల చేసుకున్నాడు. ఇక ఈ చిత్రం కూడా భారీ నష్టాలను మిగల్చడం ఖాయం కావడంతో మరోసారి బయ్యర్లు రోడ్ల మీదకి వచ్చి దీక్షలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రభావం శంకర్, రజనీ నటించిన '2.ఓ'పై కూడా పడుతోంది. అందునా '2.ఓ' చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో కూడా శంకర్, లైకా ప్రొడక్షన్స్ చెప్పే పరిస్థితుల్లో లేవు. 'కబాలి, కాలా'లు విడుదల కాకముందే '2.ఓ' చిత్రం తెలుగు హక్కులను సునీల్ నారంగ్ ఏకంగా 80కోట్లకు కొనుకున్నాడు. ఇందుకు గాను ఆయన 20కోట్లను లైకా వారికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఇక తాజాగా పరిస్థితి చూసిన నారంగ్ తనకి సినిమా రిలీజ్‌డేట్ ఎప్పుడో ఖచ్చితంగా చెప్పాలని, లేని పక్షంలో తన అడ్వాన్స్‌ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడు.
ఇక పేదల కష్టాలను గురించి తీసిన 'కాలా' చిత్రం దేశ విదేశాలలో కూడా అద్భుత కలెక్షన్లు సాధించడం ఆ దేవుని దయ వల్లనే అని రజనీ అంటున్నాడు. ప్రస్తుతం ఆయన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ లో ఉత్తరాఖండ్‌లో ఉన్నాడు. ప్రభుత్వం సహకరించడం వల్ల 'కాలా' చిత్రం కర్ణాటకలో కూడా అద్భుత కలెక్షన్లు సాధిస్తోందని రజనీ అంటున్నాడు. అయినా నిజాన్ని నిజాయితీగా ఒప్పుకునే వ్యక్తిగా పేరున్న రజనీ కూడా ఇలా మాయమాటలు చెప్పడం విస్తుగొలిపే అంశమేనని చెప్పాలి!