రానురాను కాదేదీ బయోపిక్‌కి అనర్హం అన్నట్లుగా తయారవుతోంది పరిస్థితి. మన తెలుగువారికి ఆరంభశూరత్వం ఎక్కువని, ఎవరు ఏదైనా బాటలో నడిచి విజయం సాధిస్తే ఇక అందరు గొర్రెల మందలా అదే బాటలో ట్రెండ్ పేరుతో నడుస్తారనే విమర్శ ఉంది. ఇప్పుడు అదే జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో కొండా సురేఖ, కొండామురళి దంపతుల గురించి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అందరికీ బాగా పరిచయమే. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికున్నంతకాలం ఆయనకు నమ్మిన బంట్లుగా ఉన్న వారు ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని ముందుగా బయటికి వచ్చి తమ పదవులను కూడా తృణప్రాయంగా భావించారు. దాంతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే అభిమానం ఉన్న అందరు కొండా దంపతులను ఎంతగానో ప్రేమించేవారు.
కానీ తదనంతర పరిణామాల నేపధ్యంలో కొండా దంపతులను జగన్ సరిగా గౌరవించకపోవడం వల్ల వీరు మనస్తాపం చెందారు. ఆ తర్వాత టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇక తెలంగాణలోని వరంగల్ జిల్లా వాసులలో ఈ దంపతులంటే ఎంతో భయం ఉంది. రౌడీయిజాన్ని బాగా ప్రోత్సహిస్తారని కూడా అపవాదు ఉంది. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జీవితం మీద 'యాత్ర' అనే బయోపిక్ రూపొందుతోంది. వైఎస్ బయోపిక్ అంటే అందులో ఖచ్చితంగా కొండా దంపతులను చూపించాల్సి ఉంటుంది.
ఇప్పుడు తాజాగా ఓ కన్నడ మహిళా దర్శకురాలు కొండా మురళి జీవితం మీదనే మరో బయోపిక్‌ని తీయాలని నిర్ణయించుకుందని సమాచారం. మురళిని కలిసి ఆయన జీవిత విశేషాలను కూడా తెలుసుకుంది. మరి ఈ బయోపిక్ ఎప్పటి నుంచి సెట్స్‌పైకి వెళ్తుందో చూడాలి. అయినా రానురాను పరిటాల రవి, కొండా మురళి, టైగర్ నాగేశ్వరరావు వంటి వారి బయోపిక్‌లు కూడా రూపొందుతుండటం చూస్తుంటే బయోపిక్‌ల జోరు ఎలా ఉందో అర్ధమవుతోంది. వారిని దేవుళ్లుగా చూపించే ప్రయత్నాలు అంత మంచిది కాదనే చెప్పాలి.