ఏమాటకామాటే చెప్పాలి గానీ తెలుగు చలన చిత్ర చరిత్రలో తేజ తీసిన మొదటి లోబడ్జెట్ ప్రేమకథా చిత్రం 'చిత్రం' ఓ సంచలనం. ఆ చిత్రం చిన్నచిత్రాలు, కొత్త వారిని పరిచయం చేసి కూడా హిట్స్ కొట్టవచ్చని నిరూపించింది. ఇలా నాడు ప్రేమకథా చిత్రాల ఒరవడిని ప్రారంభించిన దర్శకునిగా తేజని చెప్పుకోవచ్చు. అలా తేజ ద్వారా పరిచయం అయిన కొత్త హీరోలలో ఉదయ్‌కిరణ్, నితిన్, నవదీప్ వంటి వారు బాగానే సక్సెస్ అయ్యారు.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో భారీ నిర్మాతల లిస్ట్ తీసుకుంటే అందులో డివివి దానయ్య పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. ఎక్కువగా స్టార్స్‌తోనే భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ఈ నిర్మాత ఇటీవల 'భరత్ అనేనేను', ఆ వెంటనే బోయపాటి-చరణ్ చిత్రం, దీని తర్వాత రాజమౌళితో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మల్టీస్టారర్ మూవీని నిర్మించనున్నాడు. ఇక ఈయన గత కొంతకాలంగా తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నాడు. తెలుగులో నిర్మాతల తనయులుగా వచ్చిన వారిలో విక్టరీ వెంకటేష్ మాత్రమే సక్సెస్‌అయ్యాడు.
ఈ మధ్య రానా, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఫర్వాలేదనిపిస్తున్నారు. మరోవైపు తేజ కూడా ఎన్టీఆర్ బయోపిక్, వెంకటేష్ చిత్రాలను వదులుకుని ఖాళీగా ఉన్నాడు. ఈయన తదుపరి చిత్రం కూడా రానాతోనే చేయాలని భావిస్తున్నాడు. కానీ రానా కంటి ఆపరేషన్ బిజీలో ఉండటం వల్ల తేజ తదుపరి చిత్రం దానయ్య కుమారుడితోనే అని ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.