సాధారణంగా బతికి ఉన్న వారి బయోపిక్‌లు తీయాలంటే చాలా ఆటంకాలు ఉంటాయి. తమ జీవితంలో జరిగిన చెడును, వ్యసనాలను ఎవ్వరూ బతికుండగా బయటపెట్టరు. కానీ సంజయ్‌దత్ మాత్రం తన బయోపిక్ 'సంజు' కోసం తను డ్రగ్స్ బాధితుడు అయిన విధానం, వేశ్యలు, హీరోయిన్లు, స్త్రీలతో లైంగిక సంబంధాలు, అక్రమాయుధాలు కలిగి ఉన్న ఆరోపణ వంటి అన్ని విషయాలను ఈ చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణికి చెప్పడం నిజంగా ఆయనలోని గట్స్‌ని తెలియజేస్తుంది. సంజు తన జీవితంలోని ప్రతి కోణాన్ని దర్శకునికి చెప్పాడని ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
ఇక తాజాగా రాజ్‌కుమార్ హిరాణి 'సంజు' చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర పోస్టర్‌ని విడుదల చేశాడు. ఈ సందర్భంగా హిరాణి మాట్లాడుతూ, సంజు ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్నది. సంజు జీవితంలోని కొన్ని సంఘటనలు ఎవ్వరూ ఊహించలేని విధంగా ఉంటాయి. ఈ పోస్ట్‌కార్డ్స్‌ని చూడండి. ప్రతి ఇమేజ్ ఒక కథను తెలియజేస్తుంది. ఈ కథ నమ్మశక్యంగా ఉండదు కానీ ఇది వాస్తవం... అని అన్నారు. ఇక ఇందులోని ఓ పోస్టర్‌లో అమెరికాలోని రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి పారిపోయిన సంజు తన స్నేహితుల వద్దకు చేరుకోవడానికి బస్సు టిక్కెట్ డబ్బుల కోసం అక్కడ బిచ్చమెత్తుతున్నాడు. సంజూ మొదటి చిత్రమైన 'రాఖీ' ప్రీమియర్ షోకి మూడురోజుల ముందు ఆయన తన తల్లి నర్గీస్‌దత్‌ని కోల్పోయాడు అని రాసి ఉంది.
ఇక ఈ చిత్రంలో సంజు పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తుండగా, సంజు తల్లిదండ్రులైన సునీల్‌దత్, నర్గీస్‌లుగా పరేష్‌రావల్, మనీషా కోయిరాల నటిస్తున్నారు. ఇక ట్రైలర్‌లో సంజు పాత్రను పోషించిన రణబీర్‌కపూర్‌ని చూస్తూ ఉంటే అచ్చు సంజయ్‌దత్‌లానే ఉన్నాడు. అంతగా ఆయన తన పాత్రకు ప్రాణప్రతిష్ట చేశాడు. వీరితో పాటు ఈ చిత్రంలో సోనమ్‌కపూర్, అనుష్కశర్మ,దియామిర్జా వంటి వారు నటించారు. ఈ చిత్రం ఈనెల 29న విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటి వరకు అపజయమే ఎరుగని దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణికి ఇది ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనుందో వేచిచూడాల్సివుంది!