నేడు వైసీపీ పార్టీలో ఉండి విపక్షాలను టార్గెట్ చేయాలంటే నగరి ఎమ్మెల్యే రోజా తర్వాతే ఎవరైనా. అలాంటి ఫైర్‌బ్రాండ్ ప్రస్తుతం మరో పార్టీలో లేదని చెప్పాలి. ఇక ఈమె మాటల్లో మరీ పరుష పదజాలం, అసభ్యవ్యాఖ్యలు కూడా ఉంటాయి. ఇక రోజా నటించిన మొదటి చిత్రం శోభన్‌బాబు నటించగా, పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించిన 'సర్పయాగం' చిత్రం. ఇందులో ఆమె శోభన్‌బాబు కూతురిగా, సామూహిక మానభంగానికిలోనై సగంలోనే మరణించే పాత్రను పోషించింది. నిజానికి ఇది ప్రకాశం జిల్లాలో జరిగిన నిజ సంఘటన. దాంతో పరుచూరి గోపాలకృష్ణ 'సర్పయాగం' పేరుతో నవల రాశారు. దానికి ఆయన అన్నయ్య ఆర్డర్ వేశాడు. దీనిని చూసి రామానాయుడు పరుచూరి బ్రదర్స్‌కే దర్శకత్వ బాధ్యతలు అప్పగించి తానే నిర్మించాడు. నాడు మీనా నటించిన 'సీతారామయ్య గారి మనవరాలు' విడుదలైంది. ఆ చిత్రం చూసిన రామానాయుడు ఇందులో శోభన్‌బాబు కూతురిగా మీనాని తీసుకోవాలని పట్టుబట్టాడు.
కానీ సగంలో మరణించే పాత్ర కావడం తనకు కాస్త సమయం కావాలని గోపాలకృష్ణ.. నాయుడుని కోరారు. అదే సమయంలో పరుచూరి బ్రదర్స్‌కి ఎంతో క్లోజ్ అయిన ఎంపీ, దర్శకుడు, నటుడు శివప్రసాద్ తాను తీసిన 'ప్రేమతపస్సు' చిత్రంలోని పాటలను గోపాలకృష్ణకి చూపించారు. దాంతో ఆయన రోజాని చూసి నా చిత్రానికి శోభన్‌బాబు కూతురిగా నటించే నటి చిక్కిందని సంతోషపడ్డాడు. కానీ షూటింగ్ రెండు రోజులు జరిగిన తర్వాత కూడా రామానాయుడు మీనానే తీసుకుందాం అన్నారట. కానీ అలాగైతే నన్ను కూడా దర్శకునిగా తీసివేయండి, లేదా నా జడ్జిమెంట్‌ని నాకు వదిలేయమని చెప్పాడట. ఈ విషయం గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. రోజా ఈ చిత్రం షూటింగ్‌లో నన్ను డాడీ డాడీ అని పిలిచేది. నాడు నాకు చిటికెనవేలుకి ఓ ఉంగరం ఉండేది. రోజా డాడీ.. ఈచిత్రం 100రోజులు ఆడితే ఆ ఉంగరం నాకిస్తారా? అని అడిగింది. నీ మాట ప్రకారం జరగాలే గానీ ఇస్తానని చెప్పాను. అనుకున్నట్లుగా ఈ చిత్రం 100రోజులు ఆడింది. ఆ వేడుకలో నా ఉంగరాన్ని రోజాకి ఇచ్చాను. నాడు రామానాయుడు ఆమెలో అంతగా మీకేమి నచ్చింది అని అడిగారు. ఆమె నవ్వినప్పుడు చూడండి సార్.. తెలుగు ఆడపడుచుల ఆత్మీయ నవ్వు కనిపిస్తుంది అన్నాను.
ఇక 'సర్పయాగం' చిత్రం చూసి చిరంజీవి.. రోజాకి 'ముఠామేస్త్రి'లో అవకాశం ఇచ్చాడు. ఆ చిత్రం షూటింగ్‌లో రోజా భయంభయంగా నా పక్కనే నిలబడి నాచేయి పట్టుకుని వణుకుతూ ఉంది. చిరంజీవి గారు.. హీరోయిన్ నా పక్కన కదా.. నించోవాలి.. అని అడిగారు. దానికి నేను నా పక్కనే వణుకుతోంది. మీ పక్కన అయితే ఇంకేమైనా ఉందా? అన్నాను. అలాంటి రోజా నేడు ధైర్యంగా మాట్లాడుతున్న విధానం చూసి నాకు ఆశ్చర్యమేస్తోంది.. అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.