తెలుగులో రాయలసీమ ఫ్యాక్షన్ కథలకు శ్రీకారం చుట్టిన స్టార్ నందమూరి బాలకృష్ణ. బి.గోపాల్ దర్శకత్వంలో ఈయన చేసిన 'సమరసింహారెడ్డి, నరసింహనాయుడు' చిత్రాలు రికార్డులను తిరగరాశాయి. ఇక బి.గోపాల్ తర్వాత ఫ్యాక్షన్ చిత్రాలు తీయడంలో వి.వి.వినాయక్ పేరును ముందుగా చెప్పుకోవాలి. ఈయన తీసిన మొదటి చిత్రం 'ఆది'తోనే ఈయన ఎన్టీఆర్‌కి ఫుల్ మాస్ ఇమేజ్ వచ్చేలా బ్లాక్‌బస్టర్‌ని అందించి, ఎన్టీఆర్‌ని యంగ్‌టైగర్‌ని చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తోనే 'సాంబ', ఇక బాలకృష్ణ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మాతగా 'చెన్నకేశవరెడ్డి' తీశాడు. 'చెన్నకేశవరెడ్డి' ఫలితం ఎలా ఉన్నా కూడా అందులో పెద్ద బాలయ్యని ఆయన ఎంతో పవర్‌ఫుల్‌గా 'శరభ..శరభ' అంటూ చూపించాడు. ఈ చిత్రం 2002లో వచ్చింది.
ఇక ప్రస్తుతం బాలయ్య తన తండ్రి బయోపిక్ 'ఎన్టీఆర్'లో నటిస్తున్నాడు. తదుపరి చిత్రాన్ని వినాయక్‌కి ఒప్పుకోవడం కూడా జరిగిపోయింది. 'జైసింహా' చిత్రాన్ని నిర్మించిన సి.కళ్యాణే వినాయక్ మూవీకి కూడా నిర్మాత. 'ఎన్టీఆర్' చిత్రంలో తన పార్ట్ షూటింగ్ పూర్తి కాగానే బాలయ్య వినాయక్ చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు. ఇది కూడా ఫ్యాక్షన్ నేపధ్యంలో, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథే అని తెలుస్తోంది. ప్రస్తుతం వినాయక్ ఈ చిత్రం స్క్రిప్ట్, ప్రీపొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటు బాలయ్యకు, అటు వినాయక్‌కి ఇద్దరికి ఫ్యాక్షన్ చిత్రాలు కలిసి రావడంతో ఈ చిత్రంపై కూడా నందమూరి అభిమానులు భారీ ఆశలే పెట్టుకుని ఉన్నారు.
'అఖిల్, ఇంటెలిజెంట్' వంటి డిజాస్టర్స్ అందించిన వి.వి.వినాయక్ ఈ చిత్రంతో బ్లాక్‌బస్టర్ కొట్టి మరలా ఫామ్‌లోకి రావాలని ఆశపడుతున్నాడు. ఇక ఈ చిత్రానికి 'ఏకె 47' (ఆంధ్రా కింగ్ 47) అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, దాదాపు ఇదే టైటిల్‌ని ఫిక్స్ చేయడం ఖాయమని టాలీవుడ్ సమాచారం.