ఒకప్పుడు సాంకేతికత లేని రోజుల్లో పరభాషల్లో హిట్ అయిన చిత్రాలను ముందుగా డబ్బింగ్ చేసి, ఆ తర్వాత కథల కొరతే అన్న చందంగా వాటిని మరలా రీమిక్స్ చేసేవాడు. ఇలాంటి చిత్రాలలో వెంకటేష్ నటించిన అబ్బాయిగారు, మోహన్‌బాబు నటించిన అదిరిందయ్యా అల్లుడు, రౌడీ గారి పెళ్లాం వంటి అనేక చిత్రాలను ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ నేడు సాంకేతికత పెరిగిపోయింది. ప్రపంచంలో ఏ మూలన ఉన్న ప్రేక్షకులైనా సోషల్‌మీడియా పుణ్యమని నెట్టింట్లోనే పరభాషా చిత్రాలను చూసి వేస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఇంకా మారడం లేదు. ఆల్‌రెడీ అజిత్ డబ్బింగ్ చిత్రాన్ని మరోసారి పవన్‌కళ్యాణ్ వంటి స్టార్ డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు'గా తీశాడు. దీని ఫలితం అందరికీ తెలిసిన విషయమే.
మరో పక్క తమిళంలో విజయ్ నటించిన 'తేరీ' చిత్రాన్ని దిల్‌రాజు వంటి నిర్మాత 'పోలీస్' పేరుతో డబ్ చేశాడు. ఈ కథను మరోసారి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ చేయాలని భావించాడు. అదృష్టవశాత్తు పవన్ రాజకీయాలలో బిజీ కావడం వల్ల ఈ చిత్రాన్ని తెలుగులో మాస్ మహారాజా రవితేజ చేయనున్నాడు. ఇప్పుడు ఇలాంటి తంతే మరో చిత్రం విషయంలో కూడా జరుగుతోంది. కొంత కాలం కిందట నయనతార, విజయ్‌సేతుపతి జంటగా, విఘ్నేష్‌శివన్ దర్శకత్వంలో వచ్చిన 'నానుమ్ రౌడీ దాన్' చిత్రం తెలుగులోకి 'నేను రౌడీనే' అనే పేరుతో డబ్ అయింది.
ఇప్పుడు ఇదే చిత్రాన్ని నిర్మాత సి.కళ్యాణ్ రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్ జంటగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇంతకు ముందు రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్‌లు నటించిన 'కుమారి 21 ఎఫ్, ఈడో రకం.. ఆడో రకం' వంటి చిత్రాలు బాగా ఆడాయి. ఆ తర్వాత వచ్చిన 'అంధగాడు' చిత్రం మాత్రం నిరాశపరిచింది. గత కొంతకాలంగా రాజ్‌తరుణ్‌కి, హెబ్బాపటేల్‌కి సరైన సక్సెస్ లేదు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాలను అందిస్తుందో వేచిచూడాల్సివుంది..!