ఏదో ఈమధ్య వరుసగా రజనీకాంత్ '2.ఓ', 'కబాలి, కాలా' వంటి వరుస చిత్రాలు చేశాడేగానీ అంతకు ముందు ఆయన ఏడాదికో రెండేళ్లకో ఒక చిత్రం మాత్రమే చేసేవాడు. ఇక విషయానికి వస్తే తాజాగా రజనీ కుమార్తె ఐశ్వర్య తన తండ్రి రజనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన తండ్రి సినిమాలలో నటించడం ఇష్టం లేదని, ఆయన సినిమాలు మానేయాలని సూచించింది. దీనికి కారణాన్ని ఆమె తెలియజేస్తే, మా నాన్నకు ఇప్పుడు ఉన్న పళంగా సినిమాలు మానేయమని నేను చెప్పడం లేదు. కానీ క్రమంగా ఆయన తన సినిమాలను తగ్గించుకుంటూ వస్తే సంతోషంగా ఉంటుంది. సినిమాల బిజీ వల్ల ఆయన కుటుంబంలో ఎక్కువగా గడపలేకపోతున్నాడు. కాబట్టి తన తండ్రి సినిమాలు మానేయాలని కోరింది.
ఇక ఏదో ఏడాదికో, రెండేళ్లకో ఒక చిత్రం చేసే రజనీనే ఫ్యామిలీతో గడపలేకపోతున్నాడంటే మరి ఏడాదికి మూడు నాలుగు చిత్రాలలో నటించే వారి పరిస్థితి ఏమిటో అర్ధం కాని విషయం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సినిమాలలోనైనా కాస్త విరామం లభిస్తుందే గానీ రాజకీయాలలోకి వచ్చి బిజీ అయితే ఆ మాత్రం కూడా సమయం దొరకదు. మరి రజనీ త్వరలో రాజకీయాలలోకి రానున్నానని ప్రకటించాడు. త్వరలో పార్టీ పేరు, విధి విధానాలు, ఇతర కార్యక్రమాలను చేపట్టనున్నాడు. మరి రజనీ పాలిటిక్స్‌లోకి వెళ్లితే ఈ మాత్రం కూడా కుటుంబంతో గడిపే అవకాశాలు ఉండవు. మరి దీనిపై ఆయన కూతురు ఐశ్వర్య అభిప్రాయం ఏమిటో చూడాలి...!
ఇక ఐశ్వర్య ఇంకా మాట్లాడుతూ, విజయాలు వచ్చినప్పుడు పొంగి పోకూడదని, అలాగే అపజయాలు వచ్చినప్పుడు కుంగి పోకూడదని తన తండ్రి చెబుతాడని, దానిని ఆయన పాటిస్తాడని, తన తండ్రి చెప్పే ఆ సూక్తి అంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చింది.