త్వరలో రజనీకాంత్ రాజకీయాలలోకి రానున్నాడు. ఇలాంటి తరుణంలో ఆయన 'కబాలి' ఫేమ్ రంజిత్ పా దర్శకత్వంలో 'కాలా' చిత్రం చేశాడు. 'కబాలి'నే ఫ్లాప్ అనుకుంటే 'కాలా' చిత్రానికి దానిని మించిన డిజాస్టర్‌గా నమోదు అవుతోంది. ముఖ్యంగా తెలుగులో రజనీకాంత్ నటించిన 'మాఫియా' బ్యాక్‌డ్రాప్ చిత్రం 'కాలా' విశాల్ నటించిన 'అభిమన్యుడు' స్థాయి ఓపెనింగ్స్‌ని కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంది. ఎలా చూసినా, ఎవరు ఎన్ని చెప్పినా ప్రజాదరణ రీత్యా చూస్తే మాత్రం 'కబాలి, కాలా' రెండు ఫ్లాప్ చిత్రాల కిందకే వస్తాయి. 'కాలా' చిత్రం 'కబాలి' కంటే బెటర్ అనిపించుకున్నా కూడా 'కబాలి'కి వచ్చిన క్రేజ్, కలెక్షన్లు 'కాలా'కి రావడం లేదు.
ఇలాంటి తరుణంలో 'కాలా' చిత్రంపై ఓ గుజరాత్ దళిత ఎమ్మెల్యే ప్రశంసల వర్షం కురిపించాడు. వెనుకబడిన ప్రాంతాల ప్రజల కష్టనష్టాలను తెరకెక్కించిన తీరు బాగా ఉందని ఈ దళిత ఎమ్మెల్యే అయిన జిగ్నేష్ మేవాని ప్రశంసల జల్లు కురిపించాడు. ఆయన మాట్లాడుతూ, కాలా చిత్రం చూశాను. నేను కూడా 'కాలా'లా ఫీలయ్యాను. చాలా మంచి చిత్రం. రంజిత్ పా మరోసారి చాలెంజింగ్ చిత్రం తీశాడు. ఆయనను చూస్తే గర్వంగా ఉంది అంటూ గతంలో తాను రంజిత్ పాతో తీసుకున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. ఇక రజనీ నటించిన '2.ఓ' మాత్రమే రజనీ అభిమానులను సంతృప్తి పరుస్తుందనే ఆశతో ప్రేక్షకులు ఉన్నారు.
మరో వైపు సన్‌పిక్చర్స్ బేనర్‌లో రజనీ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించే చిత్రం ప్రారంభం కానుంది. దీని తర్వాత తనకు రెండు ఫ్లాప్‌లు ఇచ్చిన రంజిత్ పాతోనే మూడో చిత్రం చేయాలని రజనీ ఆలోచిస్తున్నాడట. దీనిపై రజనీ అభిమానులు మండిపడుతున్నారు. ఈ చిత్రం కూడా రాజకీయ కోణంలో ఉంటుందని కోలీవుడ్ మీడియా అంటోంది.