తెలుగులో సినీ నేపధ్యంలో పలు చిత్రాలు వచ్చాయి. నాటి 'శివరంజని' తేజ 'ఒక విచిత్రం', గౌతమ్‌మీనన్ 'ఏ మాయ చేశావే' వంటి చిత్రాలను వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక సినిమా ఇండస్ట్రీపై పలువురి పలు అభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి ప్రేక్షకుల అనుమానాలను తీర్చే విధంగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్‌బాబు, ఆదితీరావు హైదరి జంటగా రూపొందుతున్న 'సమ్మోహనం' ఈనెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ, నా మొదటి చిత్రం 'ఎస్‌ఎంఎస్' చిత్రం విడుదలకు వారం ముందే ఇంద్రగంటి గారితో ఓ చిత్రం చేయాలని భావించాను. శ్రీనివాస్ అవసరాల కథతో, ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ చిత్రం ప్లాన్ చేశాం. నిర్మాతలు కూడా ముందుకు వచ్చారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ చిత్రమే 'ఊహలు గుసగుసలాడే' చిత్రం.
ఇక ఇటీవల ఇంద్రగంటి గారు ఒకసారి ఫోన్ చేసి 'సమ్మోహనం' కథ వినమని కోరారు. స్టోరీ బాగా నచ్చడంతో ఓకే చెప్పాను. ఇందులో నేను విజయ్ అనే పాత్రను చేస్తున్నాను. చిల్డ్రన్స్ బుక్స్ ఇలస్ట్రేటర్‌గా నటిస్తున్నాను. ఆదితిరావు హైదరి స్టార్ హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్‌కి సినిమా ఫీల్డ్‌పై కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ప్రేక్షకులకు సినిమా ఇండస్ట్రీపై ఉండే అనుమానాలు అతనికి కూడా ఉంటాయి. వాటిని కాదని, ఈ జంట ఎలా ఒకటవుతుందనేది మెయిన్ పాయింట్. గతంలో ఇంద్రగంటి గారు తీసిన ప్యూర్ లవ్‌స్టోరీ 'అంతకు ముందు ఆ తర్వాత'. కానీ ఆయన ఇప్పటి వరకు ఇలాంటి ఇంటెన్స్ లవ్‌స్టోరీ చేయలేదు. ఇలాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదు. 'ఏమాయచేశావే' చిత్రానికి దీనికి పోలికలేదు. ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, హరీష్‌శంకర్, తరుణ్‌భాస్కర్‌లు మాత్రమే గెస్ట్ రోల్స్ చేశారు. మరే హీరో ఇందులో నటించలేదు. ఇంద్రగంటి గారిది చాలా డిఫరెంట్ స్టైల్. ఆయన చిత్రం లోకేషన్స్‌లో అందరు ఫ్రీగా ఉండవచ్చు. కెమెరా పెట్టి నటించమని అడగరు. నటీనటుల మూడ్‌ని బట్టి ఆయన షూటింగ్ చేస్తారు.
బాలీవుడ్ నటులు సహజంగా షూటింగ్‌లో ప్రొనౌన్స్ కూడా చేయలేరు. కానీ ఆదితి గారు ఎంతో కష్టపడి డబ్బింగ్ కూడా చెప్పింది. మన చుట్టూ సినీరంగంలో ఎంతో టాలెంట్ ఉన్న వారు ఎందరో ఉన్నారు. వారి కోసం ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించాను. పలువురు వచ్చి కలుస్తున్నారు. ఇక సెప్టెంబర్ నుంచి ప్రవీణ్‌సత్తార్ దర్శకత్వంలో రూపొందనున్న పుల్లెల గోపీచంద్ బయోపిక్ మొదలవుతుంది. ఆ తర్వాతి చిత్రాన్ని మా బేనర్‌లోనే ఆర్.యస్. నాయుడు దర్శకత్వంలో చిత్రం చేస్తున్నాను. మా బేనర్‌లో మహేష్‌బాబుతో ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని ఉంది.. అని చెప్పుకొచ్చాడు.