అధికారంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాసమస్యలు, ఇతర విషయాలలో సక్సెస్ అయ్యాడా? లేక ఫెయిల్ అయ్యాడా? అన్న విషయంపై ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా చర్చసాగుతోంది. ఈ నాలుగేళ్లకాలంలో చంద్రబాబు పెద్దగా సక్సెస్ కాలేకపోయారనేది రాజకీయ విశ్లేషకుల మాట. మొదటి నుంచి కేంద్రం తమను మోసం చేస్తోందని తెలిసినా బయటపడకుండా విషయాలను దాచి ఉంచి ఎన్నికలకు మరో ఏడాది ఉందనగా, చివరి కేంద్రబడ్జెట్ సమయంలోనే ఆయన బిజెపి రాష్ట్రాన్ని మోసం చేసిందని చెప్పడం దీనికి ఓ పెద్ద ఉదాహరణ. పారదర్శకత అంటే బహుశా ఇది కాదేమో. కేంద్రంపై మొదటి నుంచి పోరాడుతూ వచ్చి ప్రజలకు నిజాలు చెప్పి ఉంటే ఈ అపవాదు చంద్రబాబుకి తప్పేది. ఇక ఇది ఇలా ఉంటే అధికార పక్షంగా చంద్రబాబు నాయుడు ఎంతగా విఫలమయ్యాడో, ప్రతిపక్ష నేతగా ఉండి సమస్యలను ఎత్తి చూపడంలో ప్రభుత్వాల చేత పనిచేయించడంలో జగన్ కూడా అంతకంటే దారుణంగా విఫలమయ్యాడు. నేడు వచ్చే ఎన్నికలపై కూడా చంద్రబాబుకు తామే గెలుస్తామని ఆశ ఉన్నది అంటే అది కేవలం జగన్ చేతగానితనం, దిగజారుడు రాజకీయాల ఫలితమేనని చెప్పాలి. మొదటి నుంచి వైసీపీ అధినేతది ఒంటెద్దు పోకడ. మైసురారెడ్డి నుంచి ఎందరో మేధావులను ఆయన దూరం చేసుకున్నాడు. వారిలో ఉండవల్లి, సబ్బంహరి వంటి అనేకులు ఉన్నారు. చివరకు తన కుటుంబం కోసం ఎంతకైనా తెగించిన కొండా సురేఖను కూడా ఆయన వదులుకున్నాడంటే ఆయన నైజం అర్ధమవుతోంది.
మరోవైపు జగన్ ప్రజలు చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని మర్చిపోయి మరీ దిగజారుడు మాటలతో నడిరోడ్డుపై కాల్చేయాలి.. ఉరి తీయాలి... గుడ్డలు ఊడదీసి కొట్టాలి... ఒక అబ్బ అమ్మకు పుట్టాడా? వంటి వ్యాఖ్యలు గతంలో ఎన్నడూ ఏ ప్రతిపక్షనేతా వాడని తీవ్ర పదజాలం. ఇదే ఆయనకు మైనస్ అవుతోంది. మరోపక్క ఆయన చంద్రబాబు తన ఎమ్మెల్యేలను, ఎంపీలను తనవైపుకు లాక్కుంటూ మంత్రి పదవులు కూడా ఇచ్చాడని విమర్శిస్తూనే చంద్రబాబుపైకి ముద్రగడ పద్మనాభం వంటి వారిని ఉపయోగిస్తుండటం బాధాకరమైన విషయం, హుందాగా ఉండాల్సిన రాజకీయాలను జగన్ వీధిల్లో రచ్చ చేశాడు. ఆయనకు తోడు విజయసాయిరెడ్డి, రోజా, అంబటి రాంబాబులు మాట్లాడే భాష కూడా సంస్కారహీనంగా కనిపిస్తుంది.
ఇక విషయానికి వస్తే తెలంగాణ టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు చంద్రబాబుపై ఈ మధ్య కాలంలో తీవ్ర విమర్శలు చేశాడు. ఏపీలోని వీధి వీధికి వెళ్లి చంద్రబాబు బండారాన్ని బయటపెడతానన్నాడు. బహుశా ఆయన ఆశించిన గవర్నర్ గిరిని చంద్రబాబు ఇప్పించక పోవడమే దీనికి కారణమని ఎవరైనా చెబుతారు. అలాంటి మోత్కుపల్లిని కలవడానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారులో ఆయన నివాసం వద్దకు వచ్చాడు. కానీ అప్పటికీ మీడియా వారికి ఈ విషయం తెలిసిపోవడంతో వారు మోత్కుపల్లి నివాసం వద్ద కనిపించడంతో కారులో వచ్చిన విజయసాయిరెడ్డి కారు దిగకుండానే వెళ్లిపోయాడు. అయినా తెలంగాణలో ఉనికిలో లేని వైసీపీకి మోత్కుపల్లితో అవసరం ఏంటి? అనేది చాలా మందిని వేధించిన ప్రశ్న.
దీనికి సమాధానం కూడా ఆసక్తికరంగానే ఉంది. వచ్చే ఎన్నికలకు ముందు ఏపీకి వచ్చి మోత్కుపల్లి చంద్రబాబును విమర్శించడానికి పూనుకుంటే దానికి తమ పార్టీ నుంచి అండదండలు, సహకారం అందిస్తామని మోత్కుపల్లిని కలిసి వివరించి, ఆయన చేత వీలైనంత త్వరగా ఏపీ టూర్‌ను నిర్వహించాలనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. మరి ఇంత కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా జగన్ గారు.. మీరే ఆలోచించండి...!