మహాత్మాగాంధీ మనదేశానికి అందించిన స్ఫూర్తిలో ఒక భాగం మూడు కోతులతో ఆయన తయారు చేయించిన 'చెడు వినవద్దు...చెడు చూడవద్దు..చెడు మాట్లాడవద్దు' అనేది భావితరాలకు చెప్పిన సూక్తి. ఇక విషయానికి వస్తే ఒక్కసారి సినిమా మొదలైతే గ్యాప్ ఇవ్వకుండా, జయాపజయాలకు అతీతంగా వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్లే ఎనర్జిటికల్ స్టార్ మాస్ మహారాజా రవితేజ. ఇక ఈయన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఆమధ్య తన శ్రీమతితో ఉన్న సెల్ఫీని పోస్ట్ చేసేదాకా ఆయన కుటుంబం ఎలా ఉంటుందో కూడా చాలా మందికి అవగాహన లేదు. కెరీర్ విషయానికి వస్తే ఈయన 'బెంగాల్‌టైగర్' చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో ప్రపంచ టూర్‌కి వెళ్లివచ్చాడు. ఆ ఫోటోలు నాడు బాగా సోషల్‌మీడియాలో హల్‌చల్ చేశాయి. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత చేసిన 'రాజా ది గ్రేట్'తో రవితేజ మరలా ఫామ్‌లోకి వచ్చాడని అందరూ భావించారు.
కానీ ఆ తర్వాత వచ్చిన 'టచ్ చేసి చూడు, నేలటిక్కెట్' చిత్రాలు మాత్రం బాగా నిరాశపరిచాయి. రవితేజ మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని ఇప్పటికీ గుర్తించలేక తనదైన మూస చిత్రాలనే చేసుకుంటూ వెళ్తున్నాడని, మరో రెండు, మూడు చిత్రాలు ఇలానే చేస్తే ఆయనకు గట్టి దెబ్బ తప్పదనే విమర్శలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన ఫ్లాప్‌లలో ఉన్న శ్రీనువైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో అమెరికాలో ప్రారంభం కానుంది. ఈ మధ్యలో తనకి వచ్చిన కాస్త గ్యాప్‌లో రవితేజ తన ఫ్యామిలీతో కలిసి మలేషియా, థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లకు వెళ్లాడు. ఈ సందర్భంగా ఆయన సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన తన కుమారుడు మహాధన్, కూతురు మోక్షదలతో ఫొటోలు దిగాడు. అవి కూడా గాంధీ చెప్పిన మూడుకోతుల రూపంలో ఉండటం విశేషం.
రవితేజ కూతురు మోక్షద దీనిలో చెడు వినవద్దు అంటూ చెవులు మూసుకుంది. రవితేజ చెడు మాట్లాడవద్దు అని నోరు మూసుకున్నాడు. ఆయన కుమారుడు మహాధన్ చెడు చూడవద్దు అంటూ కళ్లు మూసుకుని ఉన్న ఫొటో ఎంతో గమ్మత్తుగా ఉంది. అలాగే మరికొన్ని ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రంలో రవితేజ మూడు షేడ్స్ ఉన్న పాత్రలను చేస్తున్నాడు. ఇప్పటికే మెయిన్ హీరోయిన్‌గా రీఎంట్రీకి ఇలియానా సిద్దమైంది. తాము తీసిన మూడు చిత్రాలతో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన మైత్రి సంస్థ దీనిని నిర్మించడం నమ్మకాన్ని కలిగిస్తోంది.