సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న '2.ఓ' చిత్రం ఎన్నో ఏళ్లుగా షూటింగ్‌ను జరుపుకుంటూనే ఉంది. 2017 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. ఆ తర్వాత గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌ల పనులు పూర్తి కాలేదని 2018 సంక్రాంతికి గానీ రిపబ్లిక్‌డే సందర్భంగా గానీ విడుదల చేస్తామని హింట్స్ ఇచ్చారు. అయినా ఆ సమయానికి కూడా ఈ చిత్రం పూర్తికాలేదు. షూటింగ్ పూర్తి చేసుకున్నా కూడా వీరు గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్ బాధ్యతలను అప్పగించిన సంస్థ దివాళా తీయడంతో ఈ చిత్రం యూనిట్ తలలు పట్టుకుంటోంది. ఈ ఏడాది అయినా తమిళ ఉగాది కానుకగా, లేక స్వాతంత్య్రదినోత్సవం, దీపావళి.. ఇలా వస్తుందంటూ రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
కానీ అసలు ఈ చిత్రం ఈ ఏడాది విడుదలయ్యే చాన్స్‌లే లేవని కోలీవుడ్ మీడియా అంటోంది. ఇక '2.ఓ' తర్వాతనే 'కాలా' చిత్రం వస్తుందని రజనీ మొదట క్లారిటీగా చెప్పాడు. కానీ అది నిజం కాలేదు. తప్పని పరిస్థితుల్లో 'కాలా' ముందుగా విడుదలైంది. ఇక రజనీ తాజాగా కార్తీక్‌సుబ్బరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బేనర్‌లో ఓ చిత్రం ప్రారంభించనున్నాడు. ఈ చిత్రం కూడా పూర్తయి, '2.ఓ' కన్నా ముందుగా రిలీజ్ అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఎందుకంటే ఈ చిత్రాన్ని ఎంతో వేగంగా తీయాలని కార్తీక్‌సుబ్బరాజు, రజనీలు భావిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి చేసి రజనీ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టనుండటంతో ఈ చిత్రం స్పీడ్‌గా పూర్తవుతుందని సమాచారం.
ఇక '2.ఓ' ఎప్పుడు పూర్తి కావాలి? ఎప్పుడు శంకర్ కమల్‌హాసన్‌తో 'భారతీయుడు 2' ప్రారంభిస్తాడో ఆ దేవుడు ఆదేశిస్తేనే తెలుస్తుంది. ఇక కమల్ ఎంతో కాలంగా విడుదల చేయలేకపోయిన 'విశ్వరూపం 2' ఎంతో కాలం తర్వాత త్వరలో విడుదల కానుంది. అలాగే '2.ఓ'ను కూడా శంకర్, లైకా ప్రొడక్షన్స్‌లు ఎప్పుడు రిలీజ్ చేస్తారో? ఎంత కాలం బాక్సులు బూజులు పట్టుకుంటాయో తెలియని పరిస్థితి అనే చెప్పాలి.