నేడు మీడియా మరీ ముఖ్యంగా సోషల్ మీడియా పరిస్థితి ఎలా తయారైందంటే అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్లు. నాన్నా పులి వంటివి సరిగ్గా సరిపోతాయి. పలు గాసిప్స్ సోషల్ మీడియాలో నిరంతరం హల్‌చల్ చేస్తుంటాయి. వీటిని ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా పుట్టిస్తారో కూడా అర్ధం కాదు. ఇలాగే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో నిజాలు రాసినా కూడా ప్రేక్షకులు, పాఠకులు నిజం అని నమ్మే పరిస్థితి పోతుంది. ఆ గుడ్‌విల్ కోల్పోతే ఏ మీడియా కూడా మనలేదనేది వాస్తవం. కానీ మీడియా వారు మాత్రం తాత్కాలికంగా వచ్చే టీఆర్పీల గురించి ఆలోచిస్తున్నారే గానీ అందులో నిజమెంత అని ఆరా తీయడం లేదు.
ఇక విషయానికి వస్తే ఈ విషయంలో మిల్కీబ్యూటీ తమన్నా కూడా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను చెప్పేది ఒకటైతే మీడియాలో వచ్చేది వేరే రకంగా ఉంటోంది. మీడియాలో అలా రాయడం వల్ల తాము వ్యక్తిగతంగా బాధపడతామని, ఈ విషయాన్ని కూడా గాసిప్ రాయుళ్లు పట్టించుకోవడం లేదని ఈమె వాపోయింది. నా గురించి ఓ వార్త రాయాలనుకున్నప్పుడు నన్ను అడిగి కన్‌ఫర్మ్ చేసి రాయండని మీడియాను కోరింది.
టీఆర్పీ రేటింగ్‌ల కోసం ఇలా హీరోయిన్ల మీద పుకార్లు సృష్టిస్తున్నారని వాపోయిన ఆమె చివరకు నా పెళ్లి విషయంలో కూడా గాసిప్స్ వస్తున్నాయి. నేను పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటానని ఆమె చెప్పుకొచ్చింది. అయినా కూడా ఇందులో వారిలో కొందరి తప్పు కూడా ఉంది. వార్తల్లో ఉండటం కోసం నటీనటులు స్వయంగా, తమ అనుచరుల చేత కూడా గాసిప్స్ రాయించుకుని ఫీడ్‌బ్యాక్ చూసుకునే వైఖరి కూడా ఈ వింత పోకడలకు మూలకారణంగా మారుతోందని చెప్పాలి.