బిగ్‌బాస్ సీజన్2 ప్రారంభమైంది. మొదటి సీజన్‌ని హోస్ట్ చేసిన ఎన్టీఆర్ స్థానంలోకి నేచురల్ స్టార్ నాని వచ్చాడు. నిజానికి మొదటి సీజన్‌లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే వారు హిందీ బిగ్‌బాస్‌తో పోలిస్తే తక్కువేనని ప్రేక్షకులు కాస్త నిరాశపడిన ఎలాగోలా ఎన్టీఆర్ తన వాక్చాతుర్యంతో ఆ లోటును పూడ్చాడు. ఇక తాజాగా ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్2 పార్టిసిపెంట్స్‌ని చూస్తే వీరు మొదటి సీజన్ పార్టిసిపెంట్స్ కన్నా కూడా చాలా తక్కువ రేంజ్ వాళ్లేనని చెప్పాలి. వీరిలో ప్రేక్షకులను అలరించే స్థాయి కలిగిన వారు ఎవరో మరికొన్నిరోజులు ఆగితేగానీ తేలదు. ఇంకాస్త మసాలా అని నాని అంటున్నాడు.
కానీ బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన వారి లిస్ట్ చూస్తే ఆ మసాలా వర్కౌట్ అవుతుందా? లేదా? అనే డౌట్ అందరికీ వస్తోంది. ఈసారి బిగ్‌బాస్2 16మంది పార్టిసిపెంట్స్‌తో 100రోజుల పాటు సాగనుంది. హౌస్‌లోకి మొదట వెళ్లిన సెలబ్రిటీ గాయని గీతామాధురి. టివి9 యాంకర్ దీప్తి, నటుడు తనీష్, నటి తేజస్వి, యాంకర్ శ్యామల, నటుడు సామ్రాట్‌రెడ్డి, ప్రముఖ హేతువాది బాబు గోగినేని తప్ప మిగిలిన వారు ఎవరో ఎవరికీ తెలియదు. వారిలో నటి భాను, రోల్ రైడా, కిరీటి దామరాజు, దీప్తి సునైన, కౌశల్, అమిత్ తివారి, గణేష్, సంజన, నూతన్ నాయుడు వంటి వారు పార్టిసిపెంట్స్‌గా ఉన్నారు.
మొత్తం అటు ఇటుగా 13 మంది ఇందులో సెలబ్రిటీలు కాగా ముగ్గురు సామాన్య వ్యక్తులకు ఎంట్రీ లభించింది. వీరిలో ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే వారు పెద్దగా కనిపించడం లేదు. సో... నానినే ఈ షో బాధ్యతలను తన ఒంటి చేత్తో మేనేజ్ చేయడం తప్ప మరో దారి లేదు. అయినా మిగిలిన భాషల కంటే తెలుగులో బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు మంచి మంచి పార్టిసిపెంట్స్ ఎందుకు ఆసక్తి చూపించడం లేదనేది పెద్ద ప్రశ్నగా మిగులుతోంది.