ఒకవైపు తేజ వదిలేయడం, మరోవైపు బాలకృష్ణ వినాయక్ మూవీతో బిజీ కానున్నాడని వచ్చిన వార్తల నేపధ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ లేటు అవుతుందేమోనని అందరు కాస్త కంగారు పడ్డారు. కానీ బాలకృష్ణ మాత్రం ఎట్టకేలకు ఈ చిత్రం పగ్గాలను క్రిష్‌కి అందజేసి మంచి పని చేశాడు. తేజ కంటే ఈ బయోపిక్‌ని బాగా తీయగల దమ్ము, సత్తా క్రిష్‌కి ఉన్నాయనే చెప్పాలి. ఇక తేజ తాను ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని పాత్రలకు కొందరిని ఎంచుకున్నాడు. కానీ క్రిష్ వచ్చిన తర్వాత అదే తారాగణంతోనే ముందుకు సాగుతాడా? లేక కొత్తవారిని ఎంచుకుంటాడా? అనే అనుమానం వచ్చింది. క్రిష్ ఈ చిత్రానికి సంబంధించిన కథను మాత్రం ఏమాత్రం మార్పు చేయకుండా కేవలం స్క్రీన్‌ప్లేను మాత్రం తనదైన శైలిలో మార్పులు చేస్తున్నాడని తెలుస్తోంది.
ఇంకోవైపు ఆయన బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక బయోపిక్‌గా రాణి ఝాన్సీలక్ష్మీభాయ్ జీవిత చరిత్రను కంగనారౌనత్‌తో కలిసి 'మణికర్ణిక'గా తీస్తున్నాడు. ఒకవైపు 'మణికర్ణిక' మరోవైపు ఎన్టీఆర్ ప్రీప్రొడక్షన్ పనుల్లో క్రిష్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన బాలకృష్ణ జన్మదినం సందర్భంగా తనదైన శైలిలో పోస్టర్‌ని వదిలాడు. మరోవైపు తేజ ఈ చిత్రంలో హరికృష్ణ పాత్రకి నందమూరి కళ్యాణ్‌రామ్‌ని, చిన్నవయసులోని ఎన్టీఆర్ పాత్రకి కళ్యాణ్‌రామ్ కుమారుడిని ఎంచుకున్నాడని వార్తలు వచ్చాయి. వారి విషయంలో మాత్రం క్రిష్ ఇంకా పూర్తిగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రకు మాత్రం తేజ భావించిన విద్యాబాలన్‌నే తీసుకున్నాడు.
ఇంతకాలం విద్యాబాలన్ ఈ చిత్రం విషయంలో తన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెడుతూ వస్తోంది. కానీ క్రిష్ ఆమెని కలిసి ఆ పాత్ర గొప్పతనం కళ్లకు కట్టినట్లు చెప్పి తేజ ఓకే చేయించలేకపోయిన విద్యాబాలన్‌ని ఓకే చేయించి మొదటి అడుగులో విజయం సాధించాడు. మరి రాబోయే రోజుల్లో మిగిలిన పాత్రలకు కూడా ఎవరిని తీసుకుంటారో స్పష్టత రానుంది. ఇక కొత్త నటీనటుల కోసం ఆడిషన్స్‌ని కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.