రాజకీయాలలో చంద్రబాబు అపరచాణ్యకుడే కావచ్చు. కానీ గత నాలుగేళ్లుగా ఆయనకు ఏమైనా వయసు పైబడిన రీత్యా వచ్చే చాదస్తం వచ్చిందా? అనే అనుమానం కలుగుతోంది. ఒకవైపు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ నారా చంద్రబాబునాయుడు, నారాలోకేష్, ఆయన మంత్రి వర్గ సభ్యులు, ఎమ్మెల్యేలపై తీవ్ర పదజాలంతో దుమ్మెత్తిపోస్తున్నాడు. ఒకవైపు విశాఖ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో పచ్చచొక్కా వాళ్ల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఖాళీ భూమి కనిపిస్తే చాలు రియల్‌ఎస్టేట్ వెంచర్స్ వేస్తూ, కబ్జాలు చేస్తున్నారు. ఇక ఇసుక మాఫియా నుంచి అమరావతి, పోలవరం వంటి వేటిల్లోనూ ఈ నాలుగేళ్లలో ఆయన సాధించిన ప్రగతి ఏమిటో ఎవ్వరికీ అర్ధంకావడం లేదు. ఇక్కడ జగన్ మంచి వాడా చెడ్డవాడా? పవన్ వ్యాఖ్యలు సమంజసమా? కాదా? అనే విషయాలను పక్కనపెడితే వారు ఆరోపిస్తున్న ప్రతి అంశాన్ని ప్రజలు నిజమేనంటున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో జరిగే అకృతాలు, పచ్చచొక్కా కార్యకర్తల ఆగడాలు మాత్రం చంద్రబాబు వరకు చేరడం లేదని అనుకోవాలా? అనే అనుమానం వస్తోంది.
ఇక ఈయన పక్కన సీఎం రమేష్, సుజనాచౌదరి, గంటా శ్రీనివాసరావు, పొంగూరు నారాయణ వంటి వారు ఉన్నంత కాలం చంద్రబాబులో ఇక మార్పును ఆశించలేమనే చెప్పాలి. నిజానికి చంద్రబాబు మొదట్లో 9ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించినప్పుడు ప్రజల వద్దకు పాలన అంటూ గ్రామాలలో ఆకస్మిక తనిఖీలు, గ్రామాలలో నిద్ర చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులలో భయం పుట్టించాడు. కార్యకర్తల ఆగడాలను కూడా సహించేవాడు కాదు. కానీ నేడు ఉన్న చంద్రబాబు నాటి చంద్రబాబులా లేడని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎక్కడ ఎవరిపై కఠిన చర్యలు తీసుకుంటే వారి ఓటు బ్యాంకు పోతుందేమో, అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తే తనకు శత్రువులు అవుతారని ఆయన భయపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అందుకే ఆయన ప్రభుత్వ ఉద్యోగులను కూడా చూసి చూడనట్లు వదిలేస్తుండటంతో అభివృద్ది సంగతేమో గానీ రాష్ట్రంలో నేడు అవినీతి నిలువెల్లా పాకిపోయింది.
ఇక విషయానికి వస్తే చంద్రబాబు తాజాగా మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృధ్దిని చూడకుండా జగన్ ఎక్కడో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని, అవినీతి జరుగుతోందంటున్నాడు. దేశంలోని మరే రాష్ట్రంలో అయినా ఇంతటి అభివృద్ది జరుగుతోందా? జగన్‌కి ఆడిపోసుకోవడం తప్ప ఏమీ తెలియదని అన్న చంద్రబాబు విలేకరులను ఓ కోరిక కోరాడు. దేశంలో మీకు నచ్చిన నాలుగు రాష్ట్రాలను ఎంచుకుని అక్కడి గ్రామాలకు జగన్‌ని తీసుకెళ్లి చూపించాలని, అక్కడి గ్రామాలు అభివృద్ది చెందుతున్నాయో లేక మన గ్రామాలు అభివృద్దిలో ఉన్నాయో ఆయన్నే స్వయంగా చూడమని చెప్పండి. నేను పాదయాత్ర చేసే కాలంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎండాకాలంలో దుమ్ము, ధూళి, వానా కాలంలో బురద కనిపించేవని, కానీ తాను అన్ని చోట్లా సిమెంట్ రోడ్లు వేశానని చెప్పాడు.
అప్పట్లో రోడ్డుకు ఇరువైపులా బహిరంగ మల విసర్జన ఉండేదని కానీ ఇప్పుడు మరుగుదొడ్లు కట్టించాం. త్వరలో 19లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చాడు. చంద్రబాబులో ఉన్న లోపం ఏమిటంటే ఆయన నిధులు మంజూరు చేస్తూ అంతా అభివృద్ది చెందుతోందనే భ్రమలో ఉన్నాడే గానీ క్షేత్రస్థాయిలో అవి ఏరకంగా దుర్వినియోగం పాలవుతున్నాయో పట్టించుకోలేకపోతున్నాడని ఖచ్చితంగా చెప్పవచ్చు.