తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులోనే కాదు... చిన్నచిన్నగా కర్ణాటక రాష్ట్రంలో కూడా సినిమాలకు, రాజకీయాలకు విడలేని బంధాలు తయారవుతున్నాయి. ఇప్పటికే అంబరీష్‌తో పాటు దుగ్గేష్, ఉపేంద్ర, ప్రకాష్‌రాజ్ వంటి ఎందరో సినీ రంగానికి చెందిన ప్రముఖులు కన్నడనాట రాజకీయాలలో ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి ఓ హీరోయిన్‌కి రెండో భర్త మాత్రమే కాదు.. ఆయన స్వయంగా నిర్మాత. ఆయన కుమారుడు హీరో కూడా. ఇక ఇప్పుడు తాజాగా కర్ణాటక మంత్రి వర్గంలో మరో నటీమణికి కేబినెట్ మంత్రి పదవి దక్కింది.
1980 దశకాలలో కన్నడ నాట లేడీ ఓరియంటెడ్ చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో పాటు పలువురు స్టార్స్ సరసన జోడీ కట్టిన నటి జయమాల. ఈమె తెలుగులో చిరంజీవి నటించిన 'రాక్షసుడు' చిత్రంలో తారకేశ్వరి పాత్రను పోషించి, చిరంజీవితో ఓ రొమాన్స్ సాంగ్ అయిన 'నీ మీద నాకు అదయ్యో' అనే డ్రీమ్ సాంగ్ వేసి స్టెప్పులేసింది. ఈమెను తాజాగా కుమారస్వామి తన మంత్రి వర్గంలోకి తీసుకుని ఆమెకి స్త్రీ, శిశుసంక్షేమ, కర్ణాటక సాంస్కృతిక శాఖలను అప్పగించారు. ఈమె టాప్ హీరోయిన్‌గా ఉంటూ తర్వాత రాజకీయాలలోకి వచ్చింది. రాజకీయాలలో చురుకైన పాత్రను పోషిస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ పదవిని నిర్వర్తిస్తోంది.
ఈమెను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. తనకు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జయమాల తెలిపింది. ఎమ్మెల్సీగా ఉంటూ ఓ మహిళ ఏకంగా కర్ణాటక రాష్ట్ర కేబినెట్ పదవిని అధిరోహించడం కర్ణాటకలో ఇదే తొలిసారి అని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈమె పరిపాలనపరంగా తనదైన శైలిని ఎలా చూపిస్తుందో వేచిచూడాల్సివుంది!