ఏ క్షణాన 'బాహుబలి' చిత్రం చేశాడో గానీ ప్రభాస్ నేషనల్ ఐకాన్ అయిపోయాడు. కానీ 'బాహుబలి' చిత్రం చేయడం కంటే, దాని ద్వారా వచ్చిన క్రేజ్‌ని, గుర్తింపును నిలబెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. గతంలో వన్‌మేన్ షోలుగా చేసి తర్వాత అనామకులుగా మిగిలి పోయిన వారు ఎందరో ఉన్నారు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ తన హోం బేనర్ వంటి యువి క్రియేషన్స్ పతాకంపై తన స్నేహితులైన వంశీ, ప్రమోద్‌లతో సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా హాలీవుడ్ చిత్రాల తరహాలో ఉంటుందని తెలుస్తోంది.
ఇక 'బాహుబలి' తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో దేశ, విదేశాలలోని సినీ ప్రేమికులు 'సాహో' కోసం కోటి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. అయితే 'బాహుబలి' విజయం అందించిన ఉత్సాహంలో 'సాహో'ని కూడా 200లకు పైగా కోట్ల బడ్జెట్‌తో ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. సాధారణంగా నేటి కాలంలో ద్విభాషా, త్రిభాషా చిత్రాల విషయానికి వస్తే చిత్రం మొత్తాన్ని ఒకే భాషల్లో తీసి, కొన్ని ముఖ్యమైన సీన్స్, ఆయా భాషల ఆర్టిస్టులతో కొద్దిగా తీసి వాటిని కూడా ద్విభాషా, త్రిభాషా చిత్రాల కలరింగ్ ఇస్తారు.
కానీ ప్రభాస్ మాత్రం అలా చేయడం లేదు. ఎంతో కష్టమైన పని అయినప్పటికీ ఒక భాషలో చెప్పిన డైలాగ్, ఎమోషన్స్‌ని వెంటనే తమిళ, హిందీ భాషల్లో కూడా చెప్పి మెప్పిస్తున్నాడు. అంటే ఒకే చిత్రానికి మూడు చిత్రాల కష్టాన్ని ప్రభాస్ పడుతున్నాడు. ఇక 'బుజ్జిగాడు మేడిన్ చెన్నై'లో కాస్త తమిళ యాస కలిపిన ప్రభాస్ 'సాహో'తో మాత్రం డైరెక్ట్ అటాక్‌ని ఇస్తుండటం విశేషంగా చెప్పాలి...!