వరుసగా 'కొచ్చాడయన్, లింగ, కబాలి' వంటి ఫ్లాప్స్ ఎదుర్కోవడం, తాజాగా 'కాలా' చిత్రానికి కూడా 'కబాలి' దర్శకుడు రంజిత్ పానే దర్శకత్వం వహించడం, పెద్దగా బడ్జెట్ లేకుండా ఈ చిత్రాన్ని రజనీ అల్లుడు ధనుష్ నిర్మించాడనే వార్తలు, పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్‌తో పాటు 8 పాటలు ఉన్నా కూడా ఏవీ ట్రెండింగ్ కాకపోవడంతో రజనీకాంత్ జీవితంలో ఎప్పుడు లేని విధంగా 'కాలా'కి బజ్ ఏర్పడలేదు. ఈ విషయంలో ఈజీగా దొరుకుతున్న టిక్కెట్లను చూస్తేనే అర్ధమవుతోంది. మరోవైపు ఈ చిత్రం సింగపూర్ ప్రీమియర్ షో చూసిన ప్రవీణ్ దేవర అనే వ్యక్తి ఈ చిత్రంలోని 45 నిమిషాల చిత్రాన్నిఆల్‌లైన్‌లో పెట్టడంతో యూనిట్ తీవ్రదిగ్బ్రాంతికి గురైంది. అయినా 'కాలా' చిత్రం మాత్రం 'కబాలి' కంటే ఎన్నో రెట్లు మెరుగుగా ఉందని, రజనీ ప్రేక్షకులను సింగిల్‌మేన్ షోగా అలరిస్తున్నాడని టాక్ వచ్చింది.
ముఖ్యంగా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ముంబైలోని ధారవి ప్రాంతంలో తమిళులను ఆదుకునే కరికాలన్ అలియస్ 'కాలా' సెకండాఫ్‌లో నానా పాటేకర్ ఇంటికి వెళ్లి హెచ్చరించే సీన్స్, 'దేవుడు శాసించాడు.. కాలా పాటిస్తున్నాడు' వంటి డైలాగ్స్‌తో పాటు ఎమోషన్ సీన్స్‌కి రజనీ స్లైల్ తోడయిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయలేదు. సినిమాని విడుదల చేయాలని, థియేటర్ల వద్ద భద్రతా చర్యలను కర్ణాటక సర్కార్ తీసుకోవాలని కోర్టు ఆదేశించినా కూడా కాలా బొమ్మ మాత్రం కర్ణాటకలో పడేలేదు.
ఈ విషయం గురించి కమల్‌హాసన్ మాట్లాడుతూ.. గతంలో నా 'విశ్వరూపం' చిత్రాన్ని కూడా కర్ణాటకలో బ్యాన్ చేశారని, రజనీ చిత్రం కోసం పలువురు కర్ణాటకలో ఎదురు చూస్తున్నారని, కాబట్టి 'కాలా'ని కర్ణాటకలో విడుదల చేసేందుకు రెండు ఫిలించాంబర్ చర్చలు జరపాలని సూచించారు. రైతుల విషయంలో ఎలాగైతే రాష్ట్రాలు చర్చలు జరుపుతున్నాయో.. సినిమాల విషయంలో కూడా ఇలాంటి చర్చలే జరపాలని, తాను ఈ విషయంలో రజనీని సపోర్ట్ చేస్తున్నానని కమల్ చెప్పాడు.
మరోవైపు రజనీ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పు మేరకు కావేరి జలాల యాజమాన్య బోర్డు నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని మాత్రమే తాను కోరానని, అంతకు మించి తానేమి అనలేదని, అందులో ఏమి తప్పు ఉందో తనకు అర్ధం కావడం లేదన్నారు. కర్ణాటక ప్రయోజనాలను దెబ్బతీసే ఉద్దేశ్యం నాకు లేదని, ఈ సినిమాని ఆపివేయడం సరికాదని, ప్రశాంతంగా ఈ చిత్రం విడుదలయ్యేలా కుమారస్వామి చర్యలు తీసుకోవాలని రజనీ కోరాడు.