'మహానటి' పుణ్యమా అని ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా బయోపిక్‌ల హవా మొదలైంది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'సై..రా..నరసింహారెడ్డి' చేస్తున్నాడు. మరోవైపు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ని క్రిష్ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా 'యాత్ర'తో పాటు త్వరలో కుస్తీ యోధునిగా పేరున్న కోడి రామ్మూర్తినాయుడుతో పాటు 1970-80 కాలంలో రాష్ట్రాన్ని గడగడలాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావుల బయోపిక్‌లకు కూడా రంగం సిద్దమవుతోంది. ఇక ఈ రెండు బయోపిక్‌లలో నటించేందుకు దగ్గుబాటి రానా ఓకే చేశాడు. కానీ మద్యలో కంటి ఆపరేషన్‌తో పాటు పలు చిత్రాలకు కమిట్‌మెంట్స్ ఉండటం వల్ల రానా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ నుంచి తప్పుకున్నాడట.
దాంతో ఈ పాత్రను చేయమని దర్శకనిర్మాతలు నేచురల్ స్టార్ నానిని అప్రోచ్ అయ్యారని సమాచారం. తాను రొటీన్‌గా చేస్తున్న కథలకు భిన్నమైన చిత్రం కావడంలో నాని కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. నాని ప్రస్తుతం కేవలం నాగార్జునతో కలిసి నటించే మల్టీస్టారర్ చిత్రంతో పాటు బిగ్‌బాస్ సీజన్2లో బిజీగా ఉన్నాడు. మరోవైపు 'కృష్ణార్జునయుద్దం' ఫ్లాప్ కావడంతో నాని కూడా ఏ చిత్రం అంటే దానికి ఒప్పుకోవడం లేదు. విక్రమ్ కె కుమార్ వంటి ఇంటిలిజెంట్ డైరెక్టర్‌కి కూడా నో చెప్పాడు. మొత్తానికి టైగర్ నాగేశ్వరరావు పాత్రని నాని చేయడం అంటే ఈ చిత్రానికి రానా నటించిన దాని కన్నాఎక్కువగానే క్రేజ్ రావడం ఖాయమని చెప్పాలి.
ఈ చిత్రానికి 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. ఇక 1970లలో స్టూవర్ట్ పురంకి చెందిన టైగర్ నాగేశ్వరరావు బ్యాంకు దొంగతనాలు చేయడంలో దిట్ట. ఎంతో మంది పోలీసులను బురిడి కొట్టించిన ఆయన 1987భారీ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. మరి నాని చేయబోయే ఈ చిత్రంలో టైగర్ నాగేశ్వరరావు పాత్రని పాజిటివ్‌గా చూపిస్తారా? లేక పోలీసు కథనాల మేరకు ఆయన్ను విలన్‌గా చూపిస్తారా? అనేది వెయిట్ చేయాల్సివుంది.