టాలీవుడ్ స్టార్స్‌లో ఒక చిత్రం విడుదలయ్యే లోపే మరో దర్శకునితో సినిమా ప్లాన్ చేయడంలో అల్లు అర్జున్ ముందుంటాడు. అందునా ఎంతో అనుభవం ఉన్న తన తండ్రి అల్లు అరవింద్ గైడెన్స్ కూడా దీనికి ఎంతో ఉపయోగపడుతోంది. ఈయన చేసే చిత్రాల కథలను ముందుగా గీతాఆర్ట్స్ సంస్థలో గ్రీన్‌సిగ్నల్ పొందాల్సిందే. దర్శకుడు, నిర్మాతలు ఎవరైనా గీతాఆర్ట్స్ ప్రమేయం తప్పని సరి అని చెప్పాలి. ఇక బన్నీ వరుస హిట్స్ నుంచి తాజాగా వచ్చిన 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' చిత్రం బాగా నిరాశపరిచింది. పవర్‌ఫుల్ మిలటరీ ఆఫీసర్‌గా బన్నీ అదరగొడతాడని భావించినా, ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ధైర్యం చేసి రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
దీంతో బన్నీ ఇప్పుడు తన తదుపరి చిత్రం ఏ దర్శకునితో చేయాలా? అనే మీమాంసలో పడ్డాడు. సాధారణంగా అల్లుఅర్జున్ ఒక చిత్రం షూటింగ్‌లో ఉండగానే మరో దర్శకునికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తాడు. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. టాప్ డైరెక్టర్స్ అందరు మిగిలిన హీరోలతో బిజీ అయ్యారు. ఆయన కొరటాల శివతో గానీ లేదా సుకుమార్‌తో గానీ చిత్రం చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవితో చిత్రం చేసే పనిలో స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. ఇక సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో ఓకే చేయించుకుని కుస్తీలు పడుతున్నాడు. దీంతో బన్నీ తాజాగా విక్రమ్ కె కుమార్ చెప్పిన ఓ కథను విన్నాడని తెలుస్తోంది. ఫస్టాఫ్ కథ బన్నీకి నచ్చినప్పటికీ సెకండాఫ్ విషయంలో మాత్రం బన్నీ పూర్తిగా సంతృప్తి చెందలేదని టాలీవుడ్ సమాచారం.
దాంతో సెకండాఫ్‌లో బన్నీ కోరిన విధంగా మార్పులు చేయాలని విక్రమ్ కె.కుమార్ భావిస్తున్నాడు. అన్ని ఓకే అయి, బన్నీని, గీతాఆర్ట్స్‌ని మెప్పిస్తే గానీ విక్రమ్ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఈ మధ్య సమయంలో బన్నీ పలువురు యువ దర్శకులు చెప్పిన కథలను వింటున్నాడని తెలుస్తోంది.