రజినీకాంత్ - రంజిత్ పా ల కాంబినేషన్ లో తెరకెక్కిన కాలా సినిమా ఈ రోజు గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజినీకాంత్ సినిమా థియేటర్స్ లోకి దిగుతుంది అంటే.. ఆ సందడే వేరు. కొంతమంది ఆఫీస్ లకు ఎగ్గొట్టేసి రజిని సినిమాకి మొదటి రోజు చెక్కేస్తే... మరికొంతమంది తమ కంపెనీలకు సెలవులిచ్చేస్తారు. అందుకే రజినీ సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా గట్టి ఓపెనింగ్స్ పడతాయి. రజినీ గత సినిమాలు ఎలా ఉన్నా రజినీ కొత్త సినిమాకి బోలెడంత క్రేజ్ ఉంటుంది. అందుకే రజినీకాంత్ సినిమాలకు ఒక నాలుగైదు రోజులవరకే టికెట్స్ దొరకడం కష్టంగా ఉంటుంది.
కానీ ఇక్కడ కాలా విషయంలో రజిని క్రేజ్ ఏమాత్రం పనిచెయ్యలేదనిపిస్తుంది కాలా ఓపెనింగ్స్ చూస్తుంటే. కాలా కి వచ్చిన ఓపెనింగ్స్ చూసిన ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. కేవలం తమిళనాట మాత్రమే కాలాకు అనుకూలంగా ఉండగా... మిగతా ప్రాంతాల్లో కాలా పరిస్థితి మాత్రం బాగోలేదంటున్నారు. అన్నిటీలో ముందుగా ఓవర్సీస్ లో కాలా పరిస్థితి ఏం బాలేదట. ఓవర్సీస్ లో గురువారం కాలా అన్ని భాషల్లో ప్రీమియర్స్ ను ప్రదర్శించగా కేవలం 600k డాలర్స్ మాత్రమే వచ్చాయని తెలుస్తోంది. మరి స్టార్ హీరోల సినిమాలు ఓవర్సీస్ ప్రీమియర్స్ తోనే ఒక మిలియన్ మార్క్ ని అందుకుంటున్న నేపథ్యంలో రజినీ కాలా సినిమా మాత్రం ఇలా అతి తక్కువ వసూళ్ళని రాబట్టింది.
మరి ఇలా కాలా ఓపెనింగ్ వసూళ్లు అతి దారుణంగా పడిపోవడానికి గల కారణం రజినీ గత సినిమాలు లింగ, కబాలి ప్లాప్స్ ఒక కారణమైతే... కబాలి తో దర్శకుడు రంజిత్ ఇచ్చిన ప్లాప్ వలన కాలాకి భారీ క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. అలాగే కాలా సినిమా ట్రైలర్, సాంగ్స్ పెద్దగా బజ్ క్రియేట్ చేయకపోవడం ఓపెనింగ్స్ పడిపోవడానికి కారణమని భావిస్తున్నారు. అలాగే మరోపక్క కర్ణాటకలో కావేరి జలాల సమస్య కాలా కి మొగుడై కూర్చుంది. ఇలా అనేక కారణాలు వలన కాలా ఓపెనింగ్ కలెక్షన్స్ కి బాగా దెబ్బపడింది అని చెప్పాలి.