సావిత్రి బయోపిక్‌గా 'మహానటి' రూపొంది అందరు ప్రేక్షకుల ప్రశంసలను పొందుతోంది. ఈ చిత్రాన్ని చూసిన వారి మనసులను తాకే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్‌అశ్విన్ ఆవిష్కరించాడు. ఇక తాజాగా నాటి సీనియర్ నటి రమాప్రభ సావిత్రి జీవితం, జెమిని గణేషన్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో తమ తండ్రిని చులకనగా చూపించారని జెమిని గణేషన్ మొదటి భార్య కూతుర్లు మండిపడుతున్నారు. వాటికి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి సరైన సమాధానాలు ఇస్తూనే ఉంది. ఇక ఈ చిత్రంలో కొన్ని లోపాలు కూడా చిన్నగా బయటకు వస్తున్నాయి. డిజిటల్ రూపంలో ఎన్టీఆర్‌ని చూపించే సమయంలో ఆయన భుజం వెనక భాగంలో ఉండే పుట్టుమచ్చను చూపించడం మర్చిపోయారు.
ఇక గోరింటాకు చిత్రం విషయంలో గుమ్మడి, సావిత్రల మధ్య వచ్చే సీన్‌ని ఎస్వీఆర్, సావిత్రిగా మార్చారు. ఇక సావిత్రిని హాస్పిటల్ వరండాలో పడుకోబెట్టే సీన్ పెద్దగా బాగాలేదని, పేలవంగా ఉందని సంజయ్ కిషోర్ కూడా విమర్శించాడు. ఇక తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ 'మహానటి' గురించి మాట్లాడుతూ, నాగ్ అశ్విన్ ఈ కథను అద్భుతంగా తెరకెక్కించాడు. సావిత్రి పాత్రను ఆయన ఆవిష్కరించిన తీరు అద్భుతం. ఒకటి రెండు సీన్స్ మినహా అయన జెమిని గణేషన్‌ని కూడా పాజిటివ్ గానే చూపించారు.
జెమిని గణేషన్ మొదటి భార్యను ఉన్నతంగా చూపించాడు. ఈ విషయాన్ని జెమిని కూతుర్లు గమనించాలి. కొన్ని సినిమా టిక్ సీన్స్ సహజంగా ప్రతి చిత్రంలో ఉంటాయి. అవి పట్టుకుని ఆరోపణలు చేయడం సరికాదు. ఒక మంచి సినిమాను చూశామని అనుకోవాలే గానీ ఒకరినొకరు తిట్టుకోవడం సరికాదు. ఇప్పటి వరకు కలిసి ఉన్న మీరు ఈ చిత్రం వల్ల విడిపోవడం తగదు అని చెప్పుకొచ్చాడు.