ప్రతిరంగంలో మోసాలు, మాట తప్పడాలు ఉన్నట్లే సినీపరిశ్రమలో కూడా అవి ఉంటాయి. అయితే సినిమా అంటే అట్రాక్షన్ ఎక్కువ కాబట్టి సినిమా ఫీల్డ్‌లోజరిగే విషయాలపై ప్రజలు క్యూరియాసిటీ చూపిస్తారు. ఇక తాజాగా నాగశౌర్య హీరోగా 'జగదేకవీరుడు అతిలోక సుందరి, అంజలి' వంటి చిత్రాలలో బాలనటిగా కనిపించి, 'ఓయ్' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన షామిలి హీరోయిన్‌గా నటించిన 'అమ్మమ్మగారిల్లు' చిత్రం విడుదలైంది. కుటుంబాలు, కుటుంబ బంధాల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం బాగానే ఆకట్టుకున్నప్పటికీ సరైన ప్రమోషన్స్ లేకపోవడం, నాగశౌర్య 'ఛలో' తర్వాత వస్తున్నచిత్రంగా బజ్ క్రియేట్ అయ్యేలా చేయడంలో దర్శకనిర్మాతలు విఫలం కావడంతో ఇది సరిగ్గా ప్రేక్షకులకి చేరువ కాలేదు.
ఇక ఈ చిత్రానికి సుందర్ సూర్య దర్శకత్వం వహించాడు. తాజాగా ఆయన తన చిత్రనిర్మాతతో కలసి మాట్లాడుతూ.. 'అమ్మమ్మగారిల్లు' చిత్రం కంటే ముందు మేమిద్దరం కలిసి ఓ ప్రేమకధా చిత్రం చేయాలని భావించాం. ఈ కథ ఇప్పటివరకు ఎవ్వరూ టచ్‌చేయని పాయింట్. ఓ హీరోని కలిసి కథ వినిపించాం. కథ బాగుంది. చేద్దాం అన్నారు. దాంతో ఆయనకు ఐదు లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాం.
కానీ ఇంతలో ఆ హీరోకి వరుస విజయాలు వచ్చాయి. దాంతో ఆయనవచ్చి ఈ చిత్రం చేయలేను. నా వద్ద ఓ కథ ఉంది. నాకు తెలిసిన ఓ దర్శకుడు కూడా ఉన్నాడు. కావాలంటే ఆ సినిమాని నిర్మించండి అన్నాడు. మేమే సైలెంట్ అయిపోయాం. ఆ హీరో కనీసం తాను తీసుకున్న అడ్వాన్స్‌ని కూడా తిరిగి ఇవ్వలేదు. సాధారణంగా సినిమా ఫీల్డ్‌లో ఓ చిత్రం ఒప్పుకుని, తర్వాత చేయకుంటే అడ్వాన్స్‌లను తిరిగి ఇస్తారు. కానీ ఆ హీరో అలా కూడా చేయలేదు... అని చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరబ్బా...?