'కాలా' విడుదలకు రెండు రోజులు కూడా సమయంలేదు. సాధారణంగా రజనీకాంత్ చిత్రం విడుదల అంటే జయాపజయాలకు అతీతంగా అడ్వాన్స్ బుకింగ్‌లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. కానీ 'కాలా' విషయంలో ఆ సందడి కనిపించడంలేదు. ఒకవైపు కర్ణాటకలో ఈ చిత్రాన్ని విడుదల కానివ్వమని కన్నడ వాణిజ్యమండలి తేల్చిచెప్పింది. మరోవైపు తమిళనాట స్టెరిలైట్ ఫ్యాక్టరీ మీద రజనీ చేసిన వ్యాఖ్యలను నార్వే, స్విట్జర్లాండ్‌లోని పలువురు వ్యతిరేకిస్తూ ఈ చిత్రాన్నివిడుదల కానివ్వమని ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి తెలుగులో కూడా పెద్దగా డబ్బింగ్ రైట్స్‌కోసం ఫ్యాన్సీ ఆఫర్లు రాలేదు.
ఇక తాజాగా హైదరాబాద్‌లో 'కాలా' ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. భారీగా జరిగిన ఈ వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ, తనపై తమిళప్రేక్షకులు ఎంత ప్రేమ చూపిస్తున్నారో, తెలుగు ప్రేక్షకులు కూడా అంతే అభిమానం చూపిస్తున్నారు. ఒకానొక సమయంలో తనకి తమిళం, తెలుగు రెండు భాషల్లో ఏ భాషలోకొనసాగాలి? అనే అనుమానం వచ్చింది. కానీ బాలచందర్ గారు నన్ను మొదట తమిళ పరిశ్రమకు పరిచయం చేయడం వల్ల అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇక తెలుగులో నాకు 'పెదరాయుడు' నుంచి మంచి క్రేజ్ వచ్చింది. అప్పటినుంచి నా చిత్రాలన్నీ తెలుగులో కూడా భారీగా విడుదల కావడం మొదలుపెట్టాయి. ఇక చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్.. ఇలా ఎవరి ప్రత్యేకత వారికి ఉంది. ఎవరికి వారే సాటి.. ఎవరి ప్రాముఖ్యంవారిది. నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకునే వాడిని.
నేను 'కబాలి' చిత్రం చేస్తున్నప్పుడు ఇంత చిన్నదర్శకుడితో రజనీ చేయడంఏమిటి అని అన్నారు. కానీ కథలో ఉన్న వైవిధ్యం రీత్యా దానిని ఓకే చేశాను. కథ బాగా ఉండటం, మంచి సందేశం ఉండటంతో ఆ చిత్రం చేశాను. అయినా కమర్షియల్‌గా ఆ చిత్రం హిట్‌కాలేదు. కానీ 'కాలా' చిత్రం ముంబై మురికివాడలు నేపధ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలోని ఐదారు పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతాయి.. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని చెప్పుకొచ్చాడు.