హైదరాబాద్‌లోని మాల్స్, సినిమా హాల్స్, మల్టిప్లెక్సులలో తినుబండారాలు, శీతల పానీయాలు వంటి వాటిని ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముతూ, సినిమాని థియేటర్‌కి వెళ్లి చూడాలంటేనే ఆర్ధికపరంగా భయపడే పరిస్థితుల్లో మద్య తరగతి, కింది స్థాయి వ్యక్తులు ఉన్నారు. దీంతో గత రెండు రోజులుగా దాదాపు 100కేసులను నమోదు చేసిన లీగల్ మెట్రాలజీ అధికారులు ఇకపై ఎంఆర్పీకి ఒక రూపాయి అదనంగానైనా సరే వసూలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్, 15 బృందాలు వివిధ మాల్స్‌లో తనిఖీలు చేపట్టాయని ఆయన తెలిపారు.
జంటనగరాలకు చెందిన పలు మాల్స్, మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లపై దాడులు నిర్వహించి వివిధ మోసాలకు పాల్పడుతున్న 100మంది దుకాణదారులపై కేసు నమోదు చేశామని అకుల్ సబర్వాల్ తెలిపారు. ఇకపై మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లలో మోసాలు జరిగినట్లు తెలిస్తే 7330774444కు ఫోన్‌చేయాలని సబర్వాల్ కోరారు. నిజానికి మన తెలుగు వారి విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఈ విధమైన దోపిడీ పెరిగిపోయింది. చిన్నపిల్లలతో కలిసి చౌక వినోద సాధనమైన సినిమాలకు వెళ్లితే వేలలో ఖర్చు అవుతోంది.
బయట అమ్మే వస్తువుల రేట్లకు దాదాపు రెండు మూడింతల ధరలను ఎక్కువగా విక్రయిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని ఎక్కువ భాగం థియేటర్లు పేరున్న ఆ నలుగురిచేతిలో ఉండటం, వారికి సినిమా పరిశ్రమతో పాటు రాజకీయంగా కూడా మంచి పలుకుబడి ఉండటంతో పాటు మిగిలిన సినిమాహాళ్లు ప్రముఖ రాజకీయనాయకులవి కావడంతో వీరి ఆగడాలకు అంతేలేకుండా పోయింది. హైదరాబాద్ అధికారులు చూపించిన నిబద్దతను రెండు తెలుగు రాష్ట్రాలలోని అందరు అధికారులు చూపాలని ప్రజలు కోరుతున్నారు.