మొత్తానికి ఏపీలో ఎలాగైనా పాగా వేయాలని కాదు..కాదు బోణీ చేయాలనేది మోదీ-అమిత్‌షాలు కంటున్న కల. ఎవరు అధికారంలోకి వచ్చినా ఫర్వాలేదు గానీ బిజెపికి డిపాజిట్లు కూడా దక్కకూడదనేది ఏపీ ప్రజల మనోగతం. వారు కాంగ్రెస్ ముందు నుంచి పొడిచిన పోటుని కూడా మర్చిపోతారేమోగానీ వెనుక నుంచి బిజెపి చేసిన వంచనను మాత్రం సహించలేని పరిస్థితి. బిజెపినే కాదు.. బిజెపితో పొత్తు అనే మాట అన్న ఎవ్వరికీ ఓటేయకూడదని ప్రజలు దాదాపు ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఇక కేంద్రంలో బిజెపికి నో ఓటు కానీ రాష్ట్రం విషయంలో మాత్రం చంద్రబాబును నమ్మాలా? లేక జగన్‌కి ఒక్క చాన్స్ ఇవ్వాలా? అనే విషయంలో మాత్రం వారు తర్జన భర్జనలు పడుతున్నారు. దీనిపై ఎన్నికల నాటికి గానీ ఓ నిశ్చితాభిప్రాయం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు బిజెపి నాటి కాంగ్రెస్ మంత్రి, రాయపాటికి బద్దశత్రువైన కన్నాలక్ష్మీనారాయణకు బిజెపి రాష్ట్ర పగ్గాలు అప్పగించడం కూడా ఈ వ్యూహంలో భాగమనే అర్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో పవన్, జేడీ లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, ముద్రగడ్డ పద్మనాభంలతో టిడిపికి కాపు ఓటు పడకుండా చీల్చి వైసీపీ గెలుపు అవకాశాలను సుసాధ్యం చేయాలని బిజెపి అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది.
కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా అర్ధమవుతోంది. రాష్ట్రంలో మరలా కాంగ్రెస్ పుంజుకుంటే అది వైసీపీకే నష్టం. వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంకు రెడ్డి, దళితులు, వాటిని కాంగ్రెస్ చీల్చుకుంటుంది. మరోవైపు రాష్ట్రంలో ఈ సారి బహుముఖ పోరు తప్పేలా లేదు. కాంగ్రెస్, బిజెపి, జనసేన, టిడిపి, వైసీపీ వంటి ఐదు పక్షాలు బరిలోకి దిగే సూచనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గణనీయంగా చీలిపోయి చివరకు టిడిపికి తనకున్న ఓట్లు తనకి పడితే చంద్రబాబే నెక్ట్స్‌సీఎం అనేట్లుగా పరిస్థితులు మారుతున్నాయేమో అని అనుమానం వస్తోంది.
ఇక తాజాగా చంద్రబాబు.. కన్నాలక్ష్మీనారాయణను ఉద్దేశించి, బిజెపికి అద్దె మైకు, వైసీపీకి సొంత మైకు అని ఎద్దేవా చేశాడు. దానికి కౌంటర్ అన్నట్టుగా కన్నా మాట్లాడుతూ, చంద్రబాబుకు ఆంధ్రా అపరిచితుడు అని బిరుదును ఇచ్చి కౌంటర్ ఇచ్చాడు. చంద్రబాబుది అన్నం పెట్టిన చేతిని నరికే సంస్కృతి. అనుభవం ఉన్న వ్యక్తి అని ప్రజలు ఓట్లేస్తే ఆయన గజదొంగను మించిపోయాడు. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు అద్దె మైకు వంటి వాడు అని దెప్పిపొడిచారు. గతంలో చేసింది నవ నిర్మాణదీక్షకాదు.. నయవంచన దీక్ష, మూడు దీక్షల్లో కాంగ్రెస్‌ని విమర్శించిన చంద్రబాబు ఈ దీక్షలో తన అసలు రూపాన్ని చూపించాడు. రాహుల్‌గాంధీ ప్రాపకం కోసం మోదీ-అమిత్‌షాలను తిడుతున్నాడు. నాలుగేళ్లలో మోదీ అవినీతి రహిత పాలన అందించారు అని చెప్పుకొచ్చాడు. అయినా బిజెపికి ఎవరు పొత్తు కుదరకపోతే ఏపీలో ఆ పార్టీకి కార్పొరేటర్‌గా కూడా ఒక్కసీటు గెలిచే సత్తా లేదనేది బహిరంగ రహస్యం.