మోహన్‌బాబు ఎక్కడికి వచ్చినా, ఏమి మాట్లాడినా అందులో క్రమశిక్షణ అనే పదం గ్యారంటీగా ఉంటుంది. ఇతర నటీనటులకు ఎవ్వరికీ క్రమశిక్షణ లేదని, కేవలం తనకు, తన కుటుంబానికి, ఎన్టీఆర్, దాసరిలకు మాత్రమే క్రమశిక్షణ ఉంది అన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయి. చివరకు జర్నలిస్ట్‌లను కూడా తిట్టి మీకు క్రమశిక్షణ లేదంటూ తిడుతుంటారు. అలాంటి గొప్పకుటుంబం నుంచి అందునా మోహన్‌బాబు చిన్నపుత్రరత్నంగా వచ్చిన మంచు మనోజ్ చేసిన ఓ ఘటన ఇప్పుడు క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే మోహన్‌బాబు కుటుంబానికి తలనొప్పిగా మారింది. అయినా మోహన్‌బాబు సామాన్యుడు కాదు. దాంతో ఈ గొడవను పోలీస్‌స్టేషన్ వరకు చేరకుండా తనదైన 'రూట్‌లో' మోహన్‌బాబు సెటిల్ చేసినట్లు సమాచారం.
మే 22న జరిగిన ఈ సంఘటన తాజాగా ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 22న మంచు మనోజ్ తన స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ నెంబర్ 45లోని ఫ్యాట్ పీజియన్ పబ్బుకి వెళ్లాడు. ఇదేమీ సొంత కథనం కాదు. స్వయాన పోలీసులు అందించిన సమాచారం. రాత్రి 11.30 దాటడంతో పబ్ నిర్వాహకులు డిజెసౌండ్‌ని బాగా తగ్గించారు. మద్యం మత్తులో ఉన్న మంచు మనోజ్‌కి కోపం నషాలానికి ఎక్కింది. తాను ఉండగా తన అనుమతి లేకుండా డీజె సౌండ్ తగ్గించడంతో ఆయన ఆగ్రహించి డిజెను, స్పీకర్లను మంచు మనోజ్ పగులగొట్టాడు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు పబ్‌కి చేరుకోగా, ఈ హీరో పూర్తిగా భిన్నమైన వాదన వినిపించాడు. తాను ఫేస్‌బుక్‌లో లైవ్‌చాట్‌లో ఉన్నానని, డిజె మోత ఎక్కువగా ఉండటంతో దానిని తగ్గించాలని కోరానని మంచు మనోజ్ పోలీసులకు తెలిపాడు.
దీంతో నిజ నిర్ధారణ కోసం సిసి టీవీ ఫుటేజ్‌ని పబ్ నిర్వాహకులు పోలీసులకు అందించారు. దీనిలో మంచు మనోజ్‌దే తప్పు అని తేలింది. ఫిర్యాదు చేయడానికి పబ్ నిర్వాహకులు ముందుకు రాలేదని, దాంతో కేసు నమోదు చేయలేదని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఇరు వర్గాలు కేసు దాకా వెళ్లకుండా కొందరు మద్యవర్తిత్వం చేశారని, దాంతో ఇరువర్గాలు కాంప్రమైజ్ అయ్యారని సమాచారం.